బీజేపీకి ఓటేస్తే హక్కులు కోల్పోయినట్టే

09-05-2024 02:35:39 AM

రైతుభరోసా రాకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర 

ప్రాణహిత కట్టి ఆదిలాబాద్ రైతులకు సాగు నీళ్లిస్తాం 

తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం 

నిర్మల్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 

ఆదిలాబాద్, మే 8 (విజయక్రాంతి) :ఓటమి భయంతో ప్రధాని మోదీ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీతో కలిసి హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయానికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌కు కేవలం నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ నిర్వహించాలని సూచించారు. అనంతరం భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీకి ఓటు వేస్తే మన హక్కులు పోతాయని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జిల్లా రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్న మోదీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వేర్వేరు కాదని.. ఈ రెండు పార్టీలు ఒకటేనని మరోసారి రుజువైందని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అవుతుందని అన్నారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక ప్రజా వ్యతిరేక చట్టాలకు బీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రైబల్ నాన్ ట్రైబల్ ప్రజల భూ సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏలను బలోపేతం చేస్తూ వందశాతం నిధులు ఇచ్చి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుంటామని, పంట నష్టం అంచనా వేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల తర్వాత పరిహారం ఇస్తామన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలంటే ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మంత్రి సీతక్క, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.