జూన్ 5 తర్వాత బీఆర్‌ఎస్ ఖతం

09-05-2024 02:38:03 AM

25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారు

తెలంగాణభవన్‌కు తాళం వేసుకోవాల్సిందే

కేసీఆర్ బస్సుయాత్ర డిపాజిట్ల కోసమే 

మరో ఐదేళ్లు సీఎంగా రేవంత్‌రెడ్డి ఉంటారు 

మీట్ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ శకం ముగుస్తుందని, ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌కు తాళం పడుతుందని, తాను చెప్పిన తేదీని గుర్తుంచుకోవాలని సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లే 20 మంది ఎమ్మెల్యేల పేర్లు కేసీఆర్ చెబుతారా? అని ఆయన సవాల్ విసిరారు. నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే దేశంలో ఇక ఎన్నికలు ఉండవని, ఓట్ల కోసం మత రాజకీయాలను చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, ముఖ్యమంత్రిగా మరో ఐదేళ్లు  రేవంత్‌రెడ్డినే ఉంటారని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పకుండా రాముడితో పేరుతో ఓట్ల రాజకీయం చేయడమేంటనీ? అని ప్రశ్నించారు. మోదీ ఆర్‌ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలేదని, అప్పుడే ట్యాక్స్ ఎలా చెల్లిస్తారో ఆయనకే తెలియాలని అన్నారు. దేశంలో మాత్రం డబుల్ ఏ ట్యాక్స్ నడుస్తోందని, దేశ సంపదనంతా అదానీ, అంబానీకే మోడీ కట్టబెడుతుతున్నారని విమర్శించారు.    

బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు.. 

ఎంపీ ఎన్నికల్లో ఒకటి, రెండు సీట్లలో డిపాజిట్ల కోసమే కేసీఆర్ బస్సుయాత్ర చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కోకాపేటలో నాలెడ్జ్ సెంటర్ కోసం తీసుకున్న 11 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంద న్నారు.  కవిత బెయిల్ కోసం బీజేపీకి ఎక్కువగా ఎంపీ సీట్లు వచ్చేలా కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ రెండు రోజులే కాదని, శాశ్వతంగా ఆంక్షలు విధించాల్సి ఉండేదన్నారు. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుందని అనుకున్నామని, కానీ మధ్యలో బ్రాందీ బాటిల్ పెడుతుందని అనుకోలేదని కోమటిరెడ్డి విమర్శించారు. కవిత అరెస్టు అయితే ఒక్కరు కూడా అయ్యో పాపం అనలేదన్నారు. మంత్రి పదవి కోసం తాను ఢిల్లీకి వెళ్లలేదని, కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలు ఎవరు లేరన్నారు. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు చేసిందేమి లేదని తెలిపారు. 

భువనగికి చ్‌వనగికి రూ. 200 కోట్లు ఇవ్వాలని 100 సార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి కంటే తాను ప్రతిపక్ష ఎంపీగా ఉండి కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా తెచ్చానని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం, టానిక్ వైన్‌షాపుల్లో దోచుకున్న డబ్బును కక్కిస్తామని హెచ్చరించారు. నగరంలో ప్రెస్‌క్లబ్‌తో పాటు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, రవికాంత్‌రెడ్డి, రమేశ్ వైట్లతో పాటు సభ్యులు  పాల్గొన్నారు.