ఆదాయ వనరులు పెంచండి
- జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాల్సిందే
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం ఆదాయ వనరులు పెంచుకోవాలని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరు కోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో డిప్యూ టీ సీఎం అధ్యక్షతన ‘రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ’ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి హాజరయ్యారు.
అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ, వివిధ శాఖల ప్రగతిపై సమీక్షించారు. భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రాని కి రావాల్సిన పన్నులను రాబట్టేందుకు కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ అమలు తీరును, ఇంటె లిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీలో తెలంగాణకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలను మరింత సమర్థవంతంగా కాపాడుకోవచ్చని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర ఆదాయంలో కీలకమైన ఎక్సైజ్ శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని సూచించారు.
ప్రభుత్వ భూములను గుర్తించాలి
అసైన్డ్ భూములపై రెవెన్యూ శాఖతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీ గా ఉన్న ప్రభుత్వ భూసంపదను గుర్తించేందుకు తక్షణమే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కూమార్ సుల్తానీయాను డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో భూముల మోనిటైజేషన్, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని ప్రభుత్వ భూసంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి (మోనిటైజేషన్) అధికారులు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికపై చర్చించారు.
గతంలో ఉప్ప ల్ భగాయత్ ప్రాజెక్ట్ విజయవంతం కాగా, మోకిలా, బుద్వేల్‌లోనూ మంచి ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం మరో మూడు కొత్త ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని ల్యాండ్ పూలింగ్ పురోగతిని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ సమావేశంలో వివరించారు. ఉప్పల్ భగాయత్ తరహాలోనే పారదర్శక విధానాలను అవలంభిస్తూ, నగర పరిధిలో మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టడానికి గల అవకాశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టును వేగవంతం చేయాలని సూచించారు. హిల్ట్ కింద జారీ చేయాల్సిన నోటిఫికేషన్లకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజల్లో, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో ఉత్తరప్రదేశ్, హర్యానాల తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గత ఆరు నెలల్లో తీసుకున్న పటిష్ట చర్యల వల్ల జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ పెరిగిందని రాష్ట్ర వాణిజ్య పన్నుల (కమర్షియల్ టాక్సెస్ అండ్ జీఎస్టీ) కమిషనర్ రఘునందన్ రావు మంత్రులకు వివరించారు.






