వేగం పెంచండి
- ఏప్రిల్‌లోగా కాళేశ్వర ఆలయం పనులను పూర్తిచేయాలి
- నాణ్యతలో రాజీ వద్దు
- నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలి
- అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం
- ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
భూపాలపల్లి/కాళేశ్వరం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ(Sri Kaleshwara Muktheshwara Swamy Temple) పునర్నిర్మాణం, అభివృద్ధి పనులతో పాటు గోదావరి పుష్కరాల(Godavari Pushkarala) ఏర్పాట్లను వేగవంతం చేసి వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) అధికారులను ఆదేశించారు. మంగళవారం కాళేశ్వరం(Kaleshwaram)లోని దేవస్థానం ఈవో కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, అటవీ, దేవాదాయ, ఆర్అండ్బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్టీసీ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ముందు అధికారులతో కలిసి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. దేవుడి నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని ఆదేశించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిముక్తీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పనుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ అధికారులు కాళేశ్వరంలోనే ఉండి పనులను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. పనుల పురోగతిని కాటారం సబ్ కలెక్టర్ గౌరవ్ శర్మ(Gaurav Sharma) ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన సమన్వయం చేయాలని ఆదేశించారు.
సమీక్షలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరి, అటవీశాఖ అధికారి కిష్టా గౌడ్, కాటారం సబ్ కలెక్టర్ గౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ దండు రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, దేవాలయ శిల్పి స్థపతి బాలసుబ్రహ్మణ్యం, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, దేవస్థానం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, సర్పంచ్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.