ఇందిరా మహిళా శక్తి భవనం గడువులోగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ఆదేశించారు. మెడికల్ కళాశాల సమీపంలో రూ.ఐదు కోట్ల నిధులతో ఎకరం స్థలంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం భవన నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
భవనం అందుబాటులోకి వస్తే మహిళా సంఘాల సభ్యులకు మీటింగులు, శిక్షణ వివిధ ప్రభుత్వ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రశ్నలు అడిగి సమాధానాలు విన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గది, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. కార్యక్రమంలో విద్యాలయం ఎస్ఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






