సహకార సిద్ధాంతానికి స్ఫూర్తి
- ముల్కనూరులో దసరాకు రైతులకు రూ.2.50 కోట్ల బోనస్
- నేడు 70వ వార్షిక మహాసభ
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): 8 వేల రైతు కుటుంబాలలో ఆనందాల పంట పండిస్తూ అన్ని తానై రైతుల్లో పూర్తి ఆత్మవిశ్వాసం నింపింది ముల్కనూర్ సహకార సంఘం(Mulkanoor Cooperative Society). నేడు ముల్కనూర్ సహకార సంఘం 70వ వార్షిక మహాసభను నిర్వహించనున్నారు. 1959వ సంవత్సరంలో బ్యాంకు ఏర్పాటు నుంచి అధ్యక్షుడిగా స్వర్గీయ అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి రైతులకు విశిష్ట సేవలు అందించారు. కేవలం 373 మంది రైతులతో 2300 మూలధనంతో బ్యాంకు ఏర్పాటు చేశారు.
14 గ్రామాలకు ఏర్పాటు చేయగా నేడు 18 గ్రామాలకు విస్తరించి ఎనిమిది వేలకు పైగా రైతులకు సేవలు అందిస్తూ ఏటా 400 కోట్ల టర్నోవర్‌తో ప్రతి దసరా పండుగ సందర్భంగా రైతులకు రెండు కోట్లకు పైగా బోనస్ రూపంలో బ్యాంక్ అధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి అందిస్తున్నారు. విత్తనాల కొనుగోలు నుండి పంటలు చేతికి వచ్చేంతవరకు అన్నదాతలకు అండగా నిలుస్తోంది. రైతులు పంటలు చేతికి వచ్చాక తిరిగి అప్పులు చెల్లిస్తుంటారు. ప్రతినిత్యం రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతిలో మెలకువలు సాంకేతిక పరిజ్ఞానంపై బ్యాంకు శావేత్తలతో సూచనలు ఇస్తోంది.
పాడి పరిశ్రమ అభివృద్ధి కొరకు బ్యాంక్ అధ్యక్షులు గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక రుణాలు ఇస్తుంటారు. బ్యాంకు పరిధిలోని అన్ని గ్రామాల్లో పశు వైద్యాధికారి ద్వారా పశువులకు చికిత్సలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని రకాల సేవలు అందిస్తారు. పత్తి చిన్నింగ్ మిల్ ఏర్పాటు చేసి రైతులకు పండించిన పత్తికి నాణ్యమైన గిట్టుబాటు ధరను అందిస్తున్నారు. బ్యాంకు పరిధిలో రైస్ బిల్లులో సొంతంగా ఏర్పాటు చేశారు. ఎక్కడ లేని విధంగా పత్తిపై క్వింటాలకు 200 వారికి వంద రూపాయలు సన్న రకాలకు వంద రూపాయలు బోనస్ రూపంలో రైతులకు చెల్లిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడుతున్నారని భావించిన బ్యాంక్ అధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి 2003వ సంవత్సరంలో 67 గ్రామాలలో డైరీ ఏర్పాటు చేశారు. నేడు డైరీ 200 గ్రామాలకు పైగా విస్తరించి 25 వేల కు పైగా పాడి రైతు కుటుంబాలలో ఆర్థిక వెలుగులు నింపుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు నాణ్యమైన పాలను సరఫరా చేస్తుంది. రైతుల సహకారంతో మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టి ప్రతి రైతును అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు.