calender_icon.png 6 February, 2026 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫెయిర్‌వెల్ గిఫ్ట్‌గా ఐఫోన్లు!

06-02-2026 12:33:48 AM

  1. అజెండాలో కార్పొరేటర్లకు ప్రతిపాదన 
  2. పదవీ కాలం ముగియడానికి ఒక్కరోజు ముందే అత్యవసర సమావేశం 
  3. ఆస్తుల లీజులు, ఆర్థిక లావాదేవీలపైనే కన్నేసిన పాలకమండలి 
  4. కోటిన్నరతో స్టడీ టూర్లు చేసినా అతీగతీ లేని నివేదికలు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలక మండలి ఐదేళ్ల ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 10వ తేదీతో ప్రస్తుత కౌన్సిల్ గడువు ముగియనుండగా, సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే.. ఈ నెల 9న  స్టాండింగ్ కమిటీ మరోసారి భేటీ కానుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అభివృద్ధి పనుల కంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాలు,వివాదాస్పద ఆర్థిక లావాదేవీలకే ఈ సమావేశంలో పెద్దపీట వేయనున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా బుధ లేదా గురువారాల్లో జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని, గడువు ముగుస్తున్న తరుణంలో అత్యవసరంగా సోమవారానికి మార్చడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది.

గత సమావేశంలో టేబుల్ ఐటమ్స్ ముందస్తు సమాచారం లేకుండా నేరుగా చర్చకు తెచ్చే అంశాలు పై మేయ ర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, ఈసారి మాత్రం అవే కీలకం కానున్నాయి. ముఖ్యంగా కార్పొరేటర్లకు ఖరీదైన ఐఫోన్లు కొనుగోలు చేసే ప్రతిపాదనను టేబుల్ ఐటమ్‌గా తెచ్చి ఆమోదించుకోవాలని పాలక పక్షం కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.

ప్రజాధనంపై స్టడీ లేదు.. అంతా జల్సానే 

ఇటీవలే అహ్మదాబాద్ వంటి నగరాల్లో స్టడీ టూర్ పేరిట కార్పొరేటర్లు చేసిన పర్యటనలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. సుమారు రూ. కోటిన్నర ప్రజాధనాన్ని వెచ్చించి విహారయాత్రలు చేసి వచ్చిన ప్రజాప్రతినిధులు, ఇప్పటి వరకు తాము అక్కడ ఏం నేర్చుకున్నారో కనీసం ఒక్క నివేదిక కూడా సమర్పించకపోవడం గమనార్హం. నగరాభివృద్ధికి ఉపయోగపడే అంశాల కంటే, పదవీ కా లం ముగుస్తున్న తరుణంలో ఖజానాను ఏ విధం గా వాడుకోవాలనే దానిపైనే కొందరు నేతలు దష్టి సారించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లీజులు.. బదలాయింపులే లక్ష్యం..

ఈ నెల 9న జరిగే భేటీలో కొన్ని కీలక ఆస్తుల లీజు పొడిగింపులు, భూ బదలాయింపులు, సీఎస్‌ఆర్ నిధుల వినియోగానికి సంబంధించిన అంశాలను ఆమోదించుకునే అవకాశం ఉంది. అభివృద్ధి పనుల పేరుతో ట్రాఫిక్ ఐలాండ్లు, పార్కుల నిర్వహణ వంటి అంశాలను చూపిస్తూనే.. తెర వెనుక ఆర్థిక లబ్ధి చేకూర్చే బిజినెస్ అజెండాను సిద్ధం చేసినట్లు విమర్శకులు మండిపడుతున్నారు. మరి గడువు ముగిసే ఆఖరి నిమిషంలో జరిగే ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకుంటుందా.. లేక ఐఫోన్ల వంటి వ్యక్తిగత వరాలతో ముగింపు పలుకుతుందా.. అన్నది వేచి చూడాలి.