బీఆర్‌ఎస్‌కు మల్లారెడ్డి దూరమైనట్లేనా?
- బిఆర్‌ఎస్‌కు దూరం
- అవుతున్నానని కార్యకర్తలు మరిచిపోతున్నారని వ్యాఖ్య
- వైరల్ గా మారిన వీడియో
- పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే
మేడ్చల్, జూలై 5 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీకి దూరమైనట్లేనా? మళ్లీ కారు గుర్తు మీద పోటీ చేయడం లేదా? అంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అవుననే అంటున్నాయి. మల్లారెడ్డి మాటలను బట్టి బి ఆర్ ఎస్ కు దూరం కావడమే గాక బిజెపిలో చేరడమో లేదా పోటీకి దూరంగా ఉండడమో జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
బర్త్ డే కార్యక్రమానికి హాజరైన ఆయన బి ఆర్ ఎస్ కు దూరమవుతున్నానని కార్యకర్తలు మర్చిపోతున్నారని అన్నారు. దీనిని బట్టి ఆయన పార్టీకి దూరమవుతున్నట్లు స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా మల్లారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు, సర్ పై అవగాహన సమావేశాలకు హాజరు కాలేదు. ఆయన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి.
’నాకు రాజకీయంపై శ్రద్ధ లేదు’
మల్లారెడ్డి గతంలో కూడా తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతున్నడంతో నెల రోజుల కిందట పలువురు ముఖ్య అనుచరులు మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. టికెట్ ఇస్తే పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి బి ఆర్ ఎస్ తరఫున మేడ్చల్ నుంచి పోటీ చేస్తారని, చిన్న కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి బిజెపిలో చేరే అవకాశం ఉందని చెప్పారు.
దీనిని బట్టి ఆయన ప్రత్యక్షరాజకీయాలకు దూరమవుతున్నారని అందరూ భావించారు. ఆ తర్వాత జూన్ 12న అలియాబాద్ లో సీఎంఆర్ స్కూల్ ప్రారంభోత్సవ సందర్భంగా కూడా క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాలపై శ్రద్ధ లేదని, కొనసాగడం కూడా చాలా కష్టం అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన పోటీ చేసే అవకాశం లేదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. బి ఆర్ ఎస్ నుంచి బిజెపిలో చేరి పోటీకి దూరంగా ఉంటారని, కుటుంబీకులచే పోటీ చేయిస్తారని అంటున్నారు.
మల్లారెడ్డి వ్యవహారంపై బి ఆర్ ఎస్ అధిష్టానం అసంతృప్తి
మల్లారెడ్డి వ్యవహారంపై బి ఆర్ ఎస్ అధిష్టానం అసంతృప్తితో ఉంది. పార్టీకి సమాచారం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులను కలవడం తప్పుపడుతోంది. ఏఐ మిషన్ ప్రారంభోత్సవానికి తమ కాలేజీకి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ ని కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డితో కలిసి ఆహ్వానించారు. వివాహ వార్షికోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి, మంత్రులను ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ మల్లారెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో ఒక పార్టీలో కొనసాగాలని మల్లారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అప్పటినుంచి మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు ఉంటున్నారు. క్యాడర్ కూడా మల్లారెడ్డి పార్టీ మారుతారన్న భావనలో ఉన్నారు.






