పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పెద్దపల్లి 23వ వార్డు కౌన్సిలర్ జడల సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల నిర్వహణ అధికారి సాధుల వెంకటేశ్వర్య పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడల సురేందర్‌కు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం పటేల్ నియామక పత్రాన్ని అందజేసి సత్కరించారు.
సమావేశంలో సురేందర్ మాట్లాడుతూ ప్రస్తుత జనగణనలో మున్నూరు కాపుల జనాభాను తక్కువగా చూపుతున్నారని, ఇది సామాజికంగా, రాజకీయంగా తమ వాటాను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి సరైన గణాంకాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
జిల్లా కేంద్రంలో మున్నూరు కాపుల ఆత్మగౌరవ ప్రతీకగా అత్యాధునిక కమ్యూనిటీ హాల్‌ను, పేద విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్‌ను ఏర్పాటు చేయడం తమ తక్షణ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో స్థల సేకరణకు కృషి చేస్తామన్నారు. మున్నూరు కాపులందరినీ సంఘటితం చేసి, రాబోయే రోజుల్లో చట్టసభల్లో తమకు దక్కాల్సిన సముచిత వాటాను సాధించుకునే దిశగా ఐక్యంగా పోరాడుతామని జడల సురేందర్ స్పష్టం చేశారు.






