ప్రతి నెలా జాబ్ నోటిఫికేషన్లు
- నేడు మూడు.. వారం పది రోజుల్లో మరో రెండు జారీ
- 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
- పరీక్షలు రాసిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై మార్కులు
- పరీక్షకు కొన్ని గంటల ముందుగానే ప్రశ్నాపత్రం సిద్ధం చేసేలా చర్యలు
- టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. ఇకపై ప్రతి నెలా ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మూడు ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయనున్నామని, వారం పది రోజుల్లో మరో రెండు జారీ చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. టీజీపీఎస్సీ భవిష్యత్‌లో చేపట్టబోయే ఉద్యోగ నియామక ప్రక్రియ, సంస్కరణల గురించి కమిషన్ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రొఫెసర్ ఎల్‌బి లక్ష్మీకాంత్ రాథోడ్, విశ్వప్రసాద్, డాక్టర్ అమీర్ ఉల్లాఖాన్, కార్యదర్శి హరితతో కలిసి చైర్మన్ బుర్రా వెంకటేశం సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు.
మంగళశారం 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందన్నారు. ప్రతి నెలా రెండు, మూడు నోటిఫికేషన్లను జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పోస్టులు, రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు, అలాగే 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్టు తెలిపారు.
రాబో యే నోటిఫికేషన్లలో అత్యధికంగా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పోస్టులు 1,393 ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు ఈ నెలలోనే మరో మూడు నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్టు తెలిపారు. విద్య శాఖలో ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీ కి కూడా నోటిఫికేషను జారీ చేయనున్నట్టు తెలిపారు. వీటికి ఇంటర్వ్యూలు ఉండబోవని తెలిపారు. కేవలం డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మాత్రమే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల మేరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
లీకేజీలు లేకుండా పరీక్షలు
భవిష్యత్తులో రిక్రూట్మెంట్ ప్రక్రియలో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఇక పై జరగబోయే పరీక్షలన్నీ పారదర్శకంగా, లీకేజీలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో కంప్యూటర్ విధానంలోనే (సీబీటీ) నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపా రు. పరీక్షలు రాసిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై మార్కులు కనబడేలా చర్యలు తీసుకుం టామన్నారు. పరీక్షలకు సంబంధించిన ఒక రోజు ముందు, లేదంటే అదేరోజు పరీక్షకు కొన్ని గంటల ముందుగానే ప్రశ్నాపత్రంను సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇలా చేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశం ఉండబోదన్నారు.
పేపర్ లీకేజీలు, నియామక ప్రక్రియపైన కమిషన్‌పై అదే పనిగా బురద జల్లే ప్రయత్నం చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయ న హెచ్చరించారు. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహణ చాలా క్లిష్టమైందన్నారు. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని, సాధ్యమైనంత వరకూ పరీక్షలు ఈ విధానంలోనే ఉంటాయని స్పష్టం చేశా రు. కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపీఎస్సీ) అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాల తరహాలోనే తెలంగాణలో పరీక్షల నిర్వహణకు పతిభా భారతి అనే సరికొత్త పద్ధతిని తీసుకురానున్నట్లు తెలిపారు.
కొన్ని శాఖల్లో ఒక్కొక్క ఖాళీనే
ప్రస్తుతం 28 రకాల పోస్టులకు ఒక్కో ఖాళీ ఉన్నదని, ఇంకో 25 రకాల పోస్టుల్లో 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్నాయని వెంకటేశం తెలిపారు. 50 కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నది 11 శాఖల్లోనేనని తెలిపారు. తమది చాలా క్లిష్టమైన ఉద్యోగమని, అందరినీ మెప్పించడం సాధ్యంకాదన్నారు. అందుకే తమపై ఎక్కువ మందికి కోపం ఉంటుందన్నారు. అందులో తప్పు కూడా లేదన్నారు. కమిషన్‌పై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారని వెంకటేశం అన్నారు.






