4 March, 2026 | 1:59 AM

పక్కా ప్రణాళికతో బీమా సంస్థకు కన్నం

04-03-2026 12:00 AM
  1. బతికుండగానే మరణ ధ్రువీకార పత్రాలు , కోట్ల రూపాయలు స్వాహా? 

భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 

భద్రాచలం, మార్చి 3 (విజయక్రాంతి): పనిచేసే సంస్థలోనే పక్కా ప్రణాళికతో కన్నం వేసి అడ్డంగా దొరికిన వైనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వెలుగు చూసింది. ఏజెన్సీ ముసుగులో 39 మంది బతికి ఉండగానే మరణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రు కోట్లు కొల్లగొట్టి అడ్డంగా బుక్కైన కొంతమంది ఎల్‌ఐసి ఏజెంట్ల ఘనకార్యం. ఎల్‌ఐసి లో ఏజెంట్గా పనిచేస్తూ పక్కా ప్రణాళికతో కొంతమంది వ్యక్తుల పేరుతో పాలసీలు కట్టి, వారే ప్రీమియం చెల్లిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత మృతి చెందినట్లు మరణ ధ్రువీకరణ పత్రాలు  సృష్టించి, రూ కోట్లను కొల్లగొట్టారు.

ఏకంగా 39 మంది బ్రతికి ఉండగానే మరణించినట్లుగా పత్రాలు సృష్టించి రూ.1.52 కోట్లను సొంత ఖాతాలో చమచేసుకున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన డెత్ క్లెయిమ్స్ ఎక్కువగా రావడంతో ఎల్‌ఐసి అధికారుల్లో అనుమానం తలెత్తింది. దీంతో ఒక కమిటీ వేసి విచారణ చేస్తే విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి. ఎవరైతే మృతి చెందారని డెత్ క్రైమ్ పొందారు వారందరూ బతికి  ఉన్నారు. 

ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రీమియం వరుసగా చెల్లిస్తే ఎలాంటి విచారణ లేకుండా డెత్ క్లెయిమ్ చెల్లించే అవకాశం ఉండటంతో సదరు ఆ ఏజెంట్ ఆ అవకాశాన్ని తన ఘరానా మోసానికి వినియోగించుకున్నాడు. పాలసీ బాండ్ తో పాటు ప్రభుత్వం నుంచి పొందిన మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించడంతో ఎల్‌ఐసి అధికారులకు ఎలాంటి అనుమానం కాలేదు. సదరు ఏజెంట్లు మోసం బయటపడటంతో భద్రాచలం ఎల్‌ఐసి బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంస్థకు కన్నం వేసిన ఏజెంట్ల పై కేసు నమోదు చేశారు.

ఐదు నెలల క్రితం ఇలాంటి సంఘటనే సారాపాక భాస్కర్ నగర్ లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో బ్రతికి ఉన్న వ్యక్తిని మృతి చెందినట్లు ఎల్‌ఐసి ని తప్పుదోవ పట్టించి ఒక ఏజెంట్ డెత్ క్రైమ్ పొందారు. ఆ సంఘటనలో ఎల్‌ఐసి ఏజెంట్ పై కేసు నమోదయింది. బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి రూ 10 లక్షల రూపాయగా రికవరీ చేశారు. అశ్వాపురం మండలానికి చెందిన స్కాం వెలికితీయడంలో బ్రాంచ్ మేనేజర్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి కోట్ల రూపాయల ఎల్‌ఐసి సంస్థ సొమ్మును కాపాడారు.