calender_icon.png 1 November, 2024 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష

12-05-2024 01:49:58 AM

కేసీఆర్ రోడ్ షోలు ఉద్యమ రోజులను గుర్తు చేశాయి

కాంగ్రెస్, బీజేపీ సభలకు అంత స్పందన లేదు

హస్తం పార్టీని శిక్షించాలని ప్రజలు నిర్ణయించారు

మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, మే 11 (విజయక్రాంతి) / గజ్వేల్: తెలంగాణ ప్రజలకు కేసీఆరే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ రోడ్ షోలు నాటి తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేశాయని, ప్రజలు ఆయనకు నీరాజనం పట్టారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు నిర్వహించిన సభలకు ప్రజల నుంచి అంత స్పందన లభించలేదని అన్నారు.

అమిత్ షా సభలో జనాలు లేక ఏడు నిమిషాల్లోనే ముగించారని, సరూర్ నగర్‌లో రాహల్ సభలో అదే పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైఫల్యాలపై గరంగరంగా ఉన్నారని, ఎన్నికల్లో ఆ పార్టీకి శిక్ష వేసేందుకు నిర్ణయించుకున్నారని తెలిపారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీకి ఉత్తపుణ్యానికి ఓటేందుకు వేయాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర బంధాన్ని ప్రజలు గుర్తించారన్నారు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండాయని, కాంగ్రెస్ రాగానే పుట్టెడు కష్టాలు వచ్చాయని విమర్శించారు. రిజర్వేషన్లపై గొంతు చించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి వర్గంలో, ఎంపీ టికెట్లలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారంటున్న రేవంత్ రెడ్డి.. నిజామాబాద్‌లో జీవన్ రెడ్డికి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మోదీ మాటల్లో నీతి, రేవంత్ మాటల్లో రీతి లేదన్నారు. పదేళ్లలో కేసీఆర్ 50 ఏళ్ల అభివృద్ధి చూపిస్తే, ఐదు నెలల్లో కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఐదేళ్లు వెనక్కి నెట్టిందని మండిపడ్డారు. మెదక్ బీజేపీ అభ్యర్థి జిమ్మిక్కులు చేస్తాడని, దుబ్బాకలోనూ ఫేక్ వీడియోలు వైరల్ చేశారని ఆరోపించారు. వెంకట్రామి రెడ్డిని ఆదరించడం అంటే బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను, తనను ఆశీర్వదించడమేనని అన్నారు. 

ఆలోచించి ఓటు వేయండి..

గజ్వేల్ పట్టణంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని హరీశ్‌రావు కోరారు. గజ్వేల్‌లో మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి శనివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిలో వెంకట్రామి రెడ్డి కలెక్టర్‌గా చురుకైన పాత్ర పోషించారని, ఇప్పుడు ఎంపీగా అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తారన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నించిన కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా తిట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసం చేసిందని కోపంతో బీజేపీకి ఓటు వేస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టే అవుతుందన్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా చెల్లుతుందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోద్దీన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి, జెడ్పీటీసీ మల్లేశం, వైస్ ఎంపీపీ బెల్దె కృష ్ణగౌడ్, నాయకుడు ప్రతాప్ రెడ్డి  పాల్గొన్నారు.