9 April, 2026 | 3:09 AM

ఎర్రవల్లిలో కీలక భేటీ

09-04-2026 01:14 AM

మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ సమావేశం

  27న ప్లీనరీపై చర్చ 

మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు నేడు జగిత్యాలకు కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచిం ది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్‌రావు బుధవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంత రించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ వ్యూహాలు, కేడర్‌ను చైతన్యపరిచే కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న బీఆర్‌ఎస్ ప్రస్తుతం భవిష్యత్ వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించినట్టు స్పష్టమవుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు భేటీలో ప్రధానంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్లీనరీపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 27న ప్లీనరీ లేదా జనరల్ బాడీ సమావేశం నిర్వహించే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ భారీ సమావేశాన్ని నిర్వహించే అవకాశాలపై చర్చించారని తెలిసింది.

పార్టీ కేడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపడం, భవిష్యత్ రాజకీయ దిశను స్పష్టంగా ప్రకటించడం కోసం ఈ ప్లీనరీని కీలక వేదికగా ఉపయోగించా లన్న భావన వ్యక్తమైనట్టు సమాచారం. ప్లీనరీ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వంపై దాడి వ్యూహం, ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాల దిశగా స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుని నేరుగా కేసీఆర్‌ను కలిశారు. 

నేడు జీవన్‌రెడ్డితో కేటీఆర్ భేటీ..

ఎర్రవల్లి ఫాంహౌస్ భేటీతో కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరిక అంశంపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే జీవన్‌రెడ్డితో కేటీఆర్ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈ క్రమం లో నేడు జగిత్యాల జిల్లాకు కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ కీలక నేతలు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జీవన్‌రెడ్డిని ప్రత్యక్షంగా కలుసుకుని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి సమావేశ మయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

అయితే కేటీఆర్‌తో భేటీ అనంతరం జీవన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు పై స్పష్టత రానున్నది. ఉత్తర తెలంగాణ లో బలమైన పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందిన జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వస్తే, ఆ ప్రాంతంలో పార్టీకి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఇది తీవ్రమైన నష్టంగా మారే అవకాశం ఉం దని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను భవిష్యత్ ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు అనుగుణంగా బీఆర్ ఎస్ వ్యూహ రచన చేస్తోంది.

ప్రస్తుత పరిణామాలన్నీ దీనికి బలం చేకూరుస్తున్నాయి. మొత్తంగా ఎర్రవల్లి భేటీతో పాటు కేటీఆర్ జగిత్యాల పర్యటన బీఆర్‌ఎస్‌కు కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్లీనరీ ద్వారా పార్టీ ని మళ్లీ శక్తివంతం చేయాలని భావిస్తుండగా, మరోవైపు ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తూ రాజకీయ సమీకరణాలను మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.