రూ.5 లక్షల కోసం వెళ్లి.. కాంట్రాక్టర్ మిస్సింగ్
శేరిలింగంపల్లి: గ్లాస్ వర్క్‌కు సంబంధించిన సుమారు రూ.5 లక్షల బకాయిలు తీసుకునేందుకు వెళ్లిన ఓ లేబర్ కాంట్రాక్టర్ అదృశ్యమైన(Labour Contractor Missing) ఘటన మాదాపూర్‌లో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అవదేష్‌కుమార్ (29) మాదాపూర్ సిద్ధిక్‌నగర్‌లో నివాసం ఉంటూ గత ఏడాది కాలంగా గ్లాస్ వర్క్ లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ నెల 24న ఉదయం ఫోనెక్స్ కంపెనీకి(Phoenix Company) వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన అవదేష్.. ఆ తర్వాత తిరిగి రాలేదు. రాత్రి వరకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పరిసర ప్రాంతాల్లో గాలించారు. అనంతరం ఫోనెక్స్ కంపెనీలో కూడా విచారించగా.. అవదేష్ ఆ రోజు అక్కడికి రాలేదని సిబ్బంది తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
దీంతో అవదేష్ సోదరుడు మిథిలేష్‌కుమార్ సోమవారం మాదాపూర్(Madhapur) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఫోనెక్స్ కంపెనీ వద్ద చేసిన గ్లాస్ వర్క్‌కు సుమారు రూ.5 లక్షలు రావాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అదృశ్యమైన అవదేష్‌కుమార్ ఆచూకీ కోసం దర్యాప్తు, గాలింపు చర్యలు చేపట్టారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం అవదేష్‌కుమార్ ఎత్తు సుమారు 5.5 అడుగులు, గోధుమ వర్ణంతో ఉంటాడు. హిందీ, మైథిలి భాషలు మాట్లాడగలడని తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.