గంజాయి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలపై ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1 కిలో 140 గ్రాముల గంజాయి(Ganja), శాంసంగ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కరీంనగర్ రూరల్ పోలీసుల(Karimnagar Rural Police)కు అందిన విశ్వసనీయ సమాచారంతో ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బంది కలిసి ముగ్దంపూర్ వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తి పోలీసులను గమనించి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: ‘నిశముక్త్’ ర్యాలీ
అనంతరం అతడిని తనిఖీ చేయగా గంజాయి లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో నిందితుడిని ముగ్దంపూర్‌కు చెందిన బుర్ర వంశీ (24)గా గుర్తించినట్లు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. వంశీపై గతంలో పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌తో పాటు ఒడిశా రాష్ట్రంలోనూ గంజాయికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి.
నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయంపై చర్యలు తీసుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.