ప్రధాని మిత్రుడికి దక్కిన భూమి

17-09-2026 | 05:35am
  1. భూమిని అప్పగించా.. కేసు విత్ డ్రా 
  2. రాతపూర్వకంగా ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యే
  3. మోదీ జోక్యంతో సద్దుమణిగిన భూవివాదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) పాఠశాల మిత్రుడు అస్గర్ అలీ వోహ్రా(Asghar Ali Vohra) (81)కు 15 ఏళ్ల నాటి వివాదంలో ఉన్న తన స్వంత భూమి దక్కింది. ఈ భూమిని అప్పగిస్తున్నట్లు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతా ప్రకటించారు. అస్గర్ అలీపై ఉన్న కేసును కూడా ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి జోక్యం తరువాత ఈ పరిణామం చోటు చేసుకోవడంతో అస్గర్‌అలీ సంతోషం వ్యక్తం చేశారు. వారంక్రితం అలీ ప్రధాని కలిసి గుజరాత్‌(Gujarat)లోని నవఘర్ పాల్ఘర్‌లో ఉన్న భూ వివాదంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ స్థలాన్ని 1989లో కొనుగోలు చేయగా, 2011లో స్థలం ఆక్రమణకు గురయ్యింది. ఈ అంశాన్ని ప్రధానికి వివరించారు. అనేక ఏళ్లుగా పోలీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా వివాదం పరిష్కారం కావడం లేదని, తన భూమి తనకు దక్కడం లేదని వాపోయారు. భూ వివాద సమస్యను పరిష్కరించి తన భూమిని తనకు ఇప్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.  అనంతరం ప్రభుత్వాధికారులు చర్యలు చేపట్టడంతో సదరు భూమి అతనికి దక్కింది. అస్గర్ అలీ వోహ్రా గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో ఉన్న బీఎన్ స్కూల్‌(BN School)లో చదువుకున్నాడు. ఇదే పాఠశాలలో ప్రధాని కూడా చదువుకున్నారు.

మరిన్ని వార్తలు