నిర్వహణలో నిర్లక్ష్యం.. కమ్మేస్తున్న బూడిద
- చెల్పూర్ ను కమ్మేస్తున్న బూడిద
- కేటిపిపి సైలో పై భాగంలో లీకేజీ
- పది రోజులుగా ఇదే పరిస్థితి
- ఇబ్బందులు పడుతున్న పరిసర గ్రామాల ప్రజలు
- పట్టించుకోని అధికారులు
గణపురం, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(Kakatiya Thermal Power Plant) కేటీపీపీ సైలో నుండి బూడిద విపరీతంగా బయటకు వస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లీకేజీ అయిన బూడిద కిలోమీటర్ల మేర గాల్లో కలిసిపోయి ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గత పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. సైలో విభాగంలో పనిచేసే సుమారు 15 మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.
సైలో పైకప్పు సరిగా లేకపోవడంతో ప్లాంట్ నుండి వచ్చే బూడిద గాల్లోకి ఎగిసిపడుతుంది. దీంతో పరిసరాల్లో ఎక్కడ చూసినా బూడిద కనిపిస్తుంది రోడ్ల వెంట వెళ్లే వాహనదారులు సమీపంలో నివాసం ఉండే ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెన్ కో యాజమాన్యానికి బూడిద రూపంలో కోట్లాది రూపాయలు టెండర్ల ద్వారా వస్తున్నప్పటికీ నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. బూడిద లీకేజీ విషయం తెలిసినా ఉన్నతాధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే బూడిద మొత్తం చెల్పూర్ గ్రామాన్ని(Chelpur village) కమ్మేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పరిసర గ్రామాల ప్రజల, ఉద్యోగుల కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే సైలో పైభాగంలో మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది.