హెచ్సీయూ ఎన్నికల బరిలో స్నేహ
జనరల్ సెక్రెటరీ పదవికి బీఎస్ఎఫ్ తరఫున పోటీ
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 26(విజయక్రాంతి): హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (University of Hyderabad) విద్యార్థి సంఘం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనరల్ సెక్రెటరీ పదవికి బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ (బీఎస్ఎఫ్) తరఫున స్నేహ వంకుడోతు పోటీ చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన స్నేహ గిరిజన నేపథ్యం నుంచి వచ్చారు.జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యాభ్యాసం అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం హెచ్సీయూలో సామాజిక శాస్త్రంలో మాస్టర్స్ చదువుతున్నారు.
విద్యార్థులకు అందాల్సిన ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడం, మెస్, క్యాంటీన్ ధరలను విద్యార్థులకు అందుబాటులో ఉంచడం, క్యాంపస్లో మహిళలు, దివ్యాంగులు సహా అన్ని వర్గాల విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడం తన ప్రధాన లక్ష్యాలని స్నేహ తెలిపారు. విద్యార్థుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విద్యార్థులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలపై జవాబుదారీతనంతో పనిచేస్తామని బీఎస్ఎఫ్ పేర్కొంది.సెప్టెంబరు 28న జరగనున్న పోలింగ్లో స్నేహకు మద్దతు ఇవ్వాలని ఆ సంఘం విద్యార్థులను కోరింది.