చెత్త వేస్తే జరిమానా తప్పదు
మున్సిపల్ కమిషనర్ సీరియస్
ఆమనగల్లు, మే 03(విజయక్రాంతి): శుభకార్యాలు జరుపుకునే ఫంక్షన్ హాళ్లు.. దుర్వాసనకు నిలయాలుగా మారకూడదని, పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యంవహిస్తే భారీ జరిమానాలు విధిస్తామని ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని 9వ వార్డులో ఉన్న కళ్యాణి గార్డెన్ వెనుక భాగంలో ఫంక్షన్ హాల్ వ్యర్థాలను పారబోయడం వల్ల తీవ్ర దుర్గంధం వస్తోందని కాలనీవాసులు కమిషనర్కు విన్నవించారు.
స్పందించిన ఆయన, వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ కుప్పలుగా పడి ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కుళ్ళిన ఆహార పదార్థాలను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ సిబ్బందిని పిలిపించి, యుద్ధ ప్రాతిపదికన ఆ వ్యర్థాలను తొలగింపజేసి సమస్యను పరిష్కరించారు.ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలోని ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కేవలం లాభాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా, సామాజిక బాధ్యతను కూడా గుర్తించాలని సూచించారు.పట్టణంలోని అన్ని ఫంక్షన్ హాళ్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆహార వ్యర్థాలు, పాలిథిన్ కవర్లను మున్సిపల్ నిబంధనల ప్రకారం తరలించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించి, పర్యావరణ హితమైన వస్తువులను వాడాలని సూచించారు. ఆమనగల్లును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం. చెత్తను రోడ్లపై, డ్రైనేజీ కాలువల్లో వేయడం వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్తను మున్సిపల్ కార్మికులకే అందించాలి‘ అని ఆయన కోరారు.
ఇకపై ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తూ కనిపిస్తే, వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.పర్యటనలో కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్, స్థానిక కాలనీవాసులు, మున్సిపల్ అధికారులు మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.






