కోలాహలంగా డిపార్ట్మెంటల్ క్రీడలు
మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) మందమర్రి సింగరేణి యోగ హాల్ లో డిపార్ట్మెంటల్ కల్చరల్, సింగరేణి హై స్కూల్ మైదానంలోని ఇండోర్ హాల్ లో టేబుల్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ పోటీలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో వైభవంగా ఆదివారం జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా AITUC మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, కేకే ఏజెంట్ ఖదిర్, జిఎం ఆఫీస్ సీనియర్ పీఓ సందీప్ హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు అతిథులు మాట్లాడుతూ... క్రీడలు శరీరానికి దృఢత్వాన్ని, మానసిక ఉత్తేజాన్ని అందించడమే కాకుండా ఉద్యోగుల మధ్య సమైక్యతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నిరంతరం విధుల్లో బిజీగా ఉండే సింగరేణి ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
పోటీల్లో గెలుపోటముల కంటే భాగస్వామ్యమే ముఖ్యమని, క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఏరియా స్థాయిలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో AITUC ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎగేటి రాజేశ్వరరావు, పెద్దపల్లి బాలయ్య, WPS GA కోఆర్డినేటర్ శివ, జనరల్ కెప్టెన్ సాక శ్రీను, కల్చరల్ కెప్టెన్ సాధన వేణి ప్రభాకర్, సీనియర్ కళాకారులు హేమంత్, సుదర్శన్ లతో పాటు పెద్ద సంఖ్యలో కళాకారులు, క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.