రాజీనే రాజమార్గం.. 2020 కేసులకు పరిష్కారం
13 ఏళ్ల ఎడబాటుకు లోక్ అదాలత్‌తో తెర
గజ్వేల్: రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు న్యాయం జరుగుతుందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మూల స్వాతి గౌడ్(Principal Junior Civil Judge Moola Swathi Goud) అన్నారు. శనివారం గజ్వేల్ కోర్టు ఆవరణ(gajwel court premises)లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో అన్ని రకాల కేసులు కలిపి 2,020 కేసులకు పరిష్కారం లభించిందని తెలిపారు. ఇదే క్రమంలో 13 ఏళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్న అహ్మదీపూర్‌కు చెందిన అండె లక్ష్మి, తొగుట మండలం లింగంపేటకు చెందిన అండె ఆంజనేయులు లోక్ అదాలత్(Lok adalat)లో రాజీపడి కుటుంబ వివాదానికి ముగింపు పలికారు.
2013లో అదనపు కట్నం వేధింపులపై లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. లోక్ అదాలత్‌లో ఇరువర్గాలతో చర్చలు జరిపి పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చడంతో 13 ఏళ్ల ఎడబాటుకు తెరపడింది. దీంతో ఇరువర్గాల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి మన్వీర్, ఏపీపీ మాధవీలత, గజ్వేల్ సీఐ రవి కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ.కిరణ్ సాగర్‌రావు, న్యాయవాది అశోక్‌రెడ్డి, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.