అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ
- మూడు గంటల్లో చేనేత మగ్గంపై నేసిన వెల్ది హరిప్రసాద్
- చీర పొడవు ఐదున్నర మీటర్లు
- సిరిసిల్ల నేతన్న మరో అద్భుతం
- ఈ రికార్డు కోసం సంవత్సరం పాటు సాధన
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 3 (విజయక్రాంతి): సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సాంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 2 గంటల 50 నిమిషాల్లో 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను తయారు చేశాడు. అనంతరం అదే చీరను అవలీలగా అగ్గిపెట్టెలో పెట్టాడు. విశ్రాంతి తీసుకోకుండా పూర్తిగా మగ్గంపైనే చీరను తయారు చేశాడు.
సహజంగా ఒక చీరను తయారు చేయాలంటే, మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. కానీ ఈయన మాత్రం మూడు గంటల్లోనే చీరను తయారు చేశాడు. ఈ రికార్డు కోసం సంవత్సరం పాటు సాధన చేసినట్టు హరిప్రసాద్ తెలిపారు. చీరను నేస్తున్న సమయంలో స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి తిలకించారు. ఆగస్టు 7న చేనేత దినోత్సవ సందర్భంగా రికార్డు సృష్టించాడని తోటి నేత కార్మికులు అభినందించారు.
భారతీయ చేనేత సంప్రదాయానికి, తెలంగాణ చేనేత కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుందని హరి ప్రసాద్ అన్నారు. చేనేత రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడం, యువతలో చేనేతపై ఆసక్తి పెంపొందించడం కోసం ఈ రికార్డు నెలకొల్పినట్లు హరిప్రసాద్ తెలిపాడు. సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.






