కొను‘గోల్‌మాల్’

05-05-2024 01:05:17 AM

ధాన్యం కొనుగోలు  కేంద్రాల్లో చేతివాటం

తాలు, దుబ్బ పేరిట  తూకాల్లో భారీ కోత

అందినకాడికి  దోచుకుంటున్న నిర్వాహకులు

తాజాగా మంచిర్యాల  జిల్లాలో ఘటన

అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ దుస్థితి

మంచిర్యాల, మే 4 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాలు పేరుతో ఇష్టారీతిన తూకాల్లో కోత విధిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటూ రైతులనున మోసగిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజనూ న్యాయంగా కొంటామని, పంటకు మద్దతు ధర  ఇస్తామని ప్రకటిస్తున్నప్పటికీ అవేమీ క్షేత్ర స్థాయిలో అమలుకావడం లేదు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కోతలు ప్రారంభ మయ్యాయి. కొన్నిచోట్ల ప్రారంభం కావాల్సి ఉన్నది. సర్కార్ ఇప్పటికే పలుచోట్ల డీఆర్డీఏ ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కేంద్రాలు ప్రారంభమైన తొలిరోజుల్లో నిర్వాహకులు పారదర్శకంగానే రైతుల నుంచి ధాన్యం సేకరించారు. వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. కానీ ఆ తర్వాత చేతివాటానికి తెరలేపారు. 

తాలు పేరిట బస్తాకు కిలో కోత

వరి కోతలు పూర్తయిన చోట సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నేరుగా మిల్లర్లకు ధాన్యం విక్రయించారు. మిల్లర్లకు అలా వందలాది ట్రక్కుల ధాన్యం అప్పగించారు. మిగిలిన ధాన్యమైనా ఎలాంటి కోతలు లేకుండా అమ్ముడు పోతుందనుకున్న రైతులకు చుక్కెదరవుతోంది. మిల్లర్లు తాలు పేరిట బస్తాకు కిలో చొప్పున ఒక క్వింటాకు ఐదు కిలోల వరకు కోత విధించడం మొదలు పెట్టారు. ఈ తతంగం అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సాధారణంగా రైతులు ధాన్యం విక్రయించేందుకు ఏవోలు, ఏఈవోలు పరిశీలించిన అనంతరం టోకెన్లు ఇవ్వాలి. కానీ క్షేత్రస్థాయిలో అదేవీ జరగడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.ఇష్టం వచ్చినట్లు ధాన్యంలో కోతలు విధిస్తున్నారు.

సిబ్బంది చేతివాటం..

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు విక్రయాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు మిల్లులకు ధాన్యం వెళ్లి తర్వాత పది బస్తాలు కోత అయిందని నిర్ధారిస్తే, ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహ కులు మాత్రం ఆ పది బస్తాలకు మరికొన్ని బస్తాలు కలుపుతున్నారు. భీమారం మండ లం బూర్గుపల్లి డీఆర్డీకే ఐకేపీ కేంద్రంలో తాజాగా భూక్యా దేవ్‌నాయక్ అనే రైతు 607 బస్తాలను తూకం వేయించగా, మిల్లర్ 24 బస్తాలు కోత విధింది 583 బస్తాలకు రశీదు ఇచ్చాడు. కానీ ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు మాత్రం చేతివాటం ప్రదర్శించి సదరు రైతుకు 576 బస్తాలకు మాత్రమే కొనుగోలు పత్రం ఇచ్చాడు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుపై నిఘా ఉంచాలని రైతులు కోరుతున్నారు.

న్యాయం కోసం కొట్లాడుత..

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను నట్టేట ముంచుతున్నారు. మొదట్ల వడ్లు మంచిగ లేవని పేచీ పెట్టిండ్రు. 42 కిలోల కోతకు ఒప్పుకుంటే ధాన్యం కొంటామని కొర్రీ పెట్టిండ్రు. ఎలాగైనా ధాన్యాన్ని అమ్ముకోవాలనే ఉద్దేశంతో సిబ్బంది సంతకం చేయంటే చేసిన. మిల్లుకు 607 బస్తాలు పంపితే, అక్కడి బోయినంక 31 బస్తాలు కట్ అవుతాయని చెప్పిండ్రు. నాకు 576 బస్తాలకు కొనుగోలు పత్రం ఇచ్చిండ్రు. తీరా మిల్లు నుంచి వచ్చిన చిట్టీని చూస్తే 583 బస్తాలకు ఇచ్చినట్టు ఉంది. సిబ్బంది నన్ను మోసం చేయాలని చూసిండ్రు. అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే డీఎం సారు వచ్చి మొత్తం పరిశీలించిండు. జరిగింది జరిగినట్టు రాసి కలెక్టరేట్‌లో ఇవ్వమమన్నరు. న్యాయం కోసం కొట్లాడుత.

 భూక్యా దేవ్‌నాయక్, రైతు, బూర్గుపల్లి, భీమారం మండలం 


చర్యలు తీసుకుంటాం.. 

అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం మిల్లుకు వెళ్లాం. ధాన్యం నాణ్యతను పరిశీలించాం. ఎన్ని బస్తాలు మిల్లర్లకు పంపించారనే అంశంపై ఆరా తీశాం.. ట్రాక్ షీట్‌ను పరిశీలించాం. మా పరిశీలనలో ఒకే రైతు ధాన్యం వచ్చినట్లు తేలింది. నిర్వాహకులు మిల్లర్ ఇచ్చిన కన్నా టార్గెట్ కంటే తక్కువ బస్తాలతో కొనుగోలు పత్రం ఇచ్చారని గుర్తించి నిర్వాహకులను హెచ్చరించాం. బాధితుడికి న్యాయంగా ఎన్ని బస్తాలకు మద్దతు ధర రావాలో అంతా ఇప్పిస్తాం. సదరు ఏజెన్సీ ఆ నష్టాన్ని భరిస్తుంది. రైతుకు ఎలాంటి నష్టం జరుగనివ్వం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకువెళతాం. తప్పుడు పనులకు పూనుకున్న నిర్వాహకులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సిబ్బంది నిబంధనల మేరకు రైతులు పండించిన ధాన్యం కొనాల్సిందే.

 గెడం గోపాల్, డీఎం సివిల్ సప్లయ్ కార్పొరేషన్, మంచిర్యాల