గ్యారెంటీలు అమలుకు నోచుకోలె
ప్రజాపాలనపై శ్వేత పత్రం ఇవ్వండి
నాడు ప్రామిసరీ నోట్లు.. నేడు దేవుళ్లపై ఒట్లు
పగలు ప్రతీకారాలతో కాంగ్రెస్ పాలన
రేవంత్ భాషను ప్రజలు గమనిస్తున్నారు
పదేండ్లలో బీజేపీ చేసింది ఏమీ లేదు
మీట్ ది ప్రెస్‌లో తన్నీరు హరీశ్‌రావు
హైదరాబాద్,మే 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. శనివారం టీఎస్‌యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో ఆయన పాల్గొన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమల్లో లేదని దుయ్యబట్టారు. ప్రజాపాలనలో ౩.౫౦ లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రామీసరీ నోట్లు.. ఇప్పుడు దేవుళ్లపై ఒట్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తా రు.
రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను, ఆయన సీనియార్టీని గౌరవించకుండా రేవంత్ రాక్షస భాష ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పరిపాలన లేదనీ, పగ ప్రతీకారాలే కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సోషల్ మీడియా కార్యకర్తలను జైల్లో పెట్టిస్తున్నా రని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలను తొలగిస్తున్నారని ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తే.. ఇప్పుడు జిల్లాలను రద్దు చేస్తామనడం ముందుకు పోవడమా? వెనక్కిపోవడమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఆంధ్రామూలాలు ఉన్నా రేవంత్‌రెడ్డితో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని, రివర్స్ గేర్‌లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా సీఎం చెబితే పెట్టుబడులు ఎలా వస్తాయి? అని అడిగారు. రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారని.. బీజేపీ నేతలు అర్వింద్, మహేశ్వర్‌రెడ్డి అంటున్నారని.. దీన్ని సీఎం ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, కాంగ్రెస్, బీజేపీ కంటే అధికంగా పార్లమెంట్ సీట్లు బీఆర్‌ఎస్‌కే వస్తాయాని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గత పది సంవత్సరాల్లో తెలంగాణకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. వడ్లు కొనండని అడిగితే.. నూకలు తిని బతకండని కేంద్ర మంత్రులు తెలంగాణను ఎగతాళి చేశారని గుర్తుచేశారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సీట్లు అడుగుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, రైతులకు ఉచిత కరెంట్, మెడికల్ కాలేజీల, కొత్త జిల్లాలు, కేసిఆర్ కిట్లు, తాగు నీరు, సాగు నీరు ఇస్తే.. బీజేపీ అదానీని ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్‌లో నిలబెట్టిందని విరుచుకుపడ్డారు. ధరలు భారీగా పెంచి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసిందని ఆరోపించారు.




