రైతు భవిష్యత్తుకు కొత్త దిశ మెగా రైతు మేళా
రైతు సంక్షేమం నుండి ఆదాయ పెరుగుదల దిశగా ప్రభుత్వం అడుగు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హన్మకొండ అర్బన్, 7 మే (విజయక్రాంతి): రైతు భవిష్యత్తుకు కొత్త దిశ మెగా రైతు మేళా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు హనుమకొండ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించారు. మూడు రోజుల రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా చివరి రోజున గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరై వివిధ స్టాళ్లను సందర్శించారు.
వారి వెంట వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, రాష్ట్ర హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహాత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, సంబంధిత శాఖల జిల్లా ఆఅధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెగా రైతు మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మారుతున్న వ్యవసాయ విధానాలకు అనుగుణంగా యాంత్రీకరణ, పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్లు, అధికారులు సమన్వయంతో ఈ మేళాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రుణమాఫీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఆయిల్ పామ్ మిల్లును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వాతావరణ ప్రభావం తక్కువగా ఉండే, అధిక లాభాలు ఇచ్చే ఆయిల్ పామ్ పంటను రైతులు విస్తృతంగా సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రైతులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా స్ఫూర్తిదాయక ప్రసంగాలు విన్నామని తెలిపారు. వివిధ పంటలను సాగు చేస్తున్న అనుభవజ్ఞులైన రైతులు తమ అనుభవాలను పంచుకోవడం ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు.
ప్రస్తుతం ఆహార పదార్థాలు, పానీయాలలో కల్తీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సహజ, సేంద్రియ వ్యవసాయానికి మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. ప్రజా పాలనలో రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటల సాగు చేయాలని సూచించారు.
సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించి ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయాలని కోరారు. ఆయిల్ పామ్ పంట లాభసాటిగా ఉన్నందున రైతులు దీని సాగును విస్తృతంగా చేపట్టాలని మంత్రి సూచించారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రైతులకు చెందాల్సిన అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తున్నదని తెలిపారు.ఈ సందర్భంగా ఆదర్శ రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు.






