8 May, 2026 | 1:33 AM

చేతివృత్తుల.. ‘చేతులు’.. విరిగిపోయే పల్లెల్లోనా..

08-05-2026 12:28 AM
  1. పల్లె యాది కొచ్చేనా... ‘పనిముట్లు‘ గుర్తు కొచ్చేనా...
  2. రెడీమేడ్ ఫర్నిచర్ దే రాజ్యం...
  3. రెడీమేడ్ పసిడితో స్వర్ణకారుల పని శూన్యం..
  4. పని లేక శిల్పి కమ్మరి,కంచరి జీవనం కష్టం..
  5. నాడు సృష్టికర్తలు నేడు సమస్యలిస్టులు..
  6. విశ్వబ్రాహ్మణులను పట్టించుకోని పాలకులు..
  7. కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం నీలి నీడలు..?

బాన్సువాడ, మే 7 (విజయ క్రాంతి): సృష్టికి వారసులైన విశ్వకర్మలు నేడు సమస్యలిస్టులుగా మారిపోయారు. నాడు పల్లెలు పచ్చదనంగా ఉండాలంటే ప్రతి దానికి విశ్వకర్మలే ఆయువుపట్టుగా నిలిచేవారు. పంట సాగు నుండి మొదలుకొని పెళ్లిళ్ల వరకు విశ్వకర్మల పాత్ర కీలకంగా ఉండేది. కొత్తింటి ఆశ నెరవేరాలన్న వడ్రంగులే ఆధారంగా నిలిచేవారు. భక్తితో గుడులు కట్టుకోవాలన్న, దేవుళ్లను స్మరించుకోవాలన్నా విశ్వకర్మ అయిన శిల్పి పాత్ర ఆధార మయ్యేది.

పూజా సామాగ్రి, త్రాగునీటి బిందెలతో పాటు ఇతర పనిముట్ల తయారీలో కంచరి అవసరం ఎంతైనా ఉండేది. నాగలి తయారు కావాలన్నా కర్రు, కొండి, కొడవలి, కత్తి,గొడ్డలి రైతుల  చేతికి అందాలన్నా కమ్మరి పని వారిని కలవాల్సి ఉండేది. పంచకర్మలైన వడ్రంగి, కంసాలి, కమ్మరి, కంచరి,శిల్పి లు గ్రామాల్లో ప్రతి విషయంలోనూ ప్రధాన భూమికను పోషించేవారు. వీరి వల్ల పల్లెలు సుభిక్షంగా వర్ధిల్లేవి. అలాంటి విశ్వబ్రాహ్మణుల జీవనస్థితి దయనీయ పరిస్థితికి వెళ్ళింది. విశ్వకర్మల పేరు గొప్ప.. బతుకు దిబ్బ అన్న చందంగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వకర్మలు పల్లె యాది కొచ్చేనా.. పనిముట్లు గుర్తుకొచ్చిన అంటూ దీనంగా స్వరాగాలు తీసే పరిస్థితి గోచరించింది. 

విశ్వకర్మలు అంటే ఎవరు..

విశ్వకర్మ బ్రహ్మదేవుడి కుమారుడని, దేవతల ఆయుధాలు వాహనాలు రాజభవనాలను సృష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మ సృష్టికర్త కాబట్టి నేడు విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ గా పూజిస్తారు. విశ్వకర్మ భగవాన్ లంక ద్వారక ఇంద్రప్రస్థ వంటి నగరాలను సృష్టించినట్లు చరిత్ర పుటాలు చెబుతున్నాయి. విశ్వకర్మలు సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారు. జయంతిని విశ్వకర్మ భగవాన్ జనాత్మక శక్తి ప్రతిభ కృషికి నివాళిగా భావిస్తారు. బ్రహ్మ పంచముఖాల నుండి మను మయ వస్తా శిల్పి విశ్వగ్న అని ఐదు బ్రహ్మలు ఉద్భవించారని, అందుకే వీరిని విశ్వబ్రాహ్మణులుగా గుర్తించడం జరుగుతుంది.

సత్య యుగంలో దేవతల నివాసం, సువర్ణ లంకను నిర్మించినట్లు తాళపత్ర గ్రంధాలు స్పష్తీకరిస్తున్నాయి. త్రేతా యుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించగా, ద్వాపర యుగంలో ద్వారకా నగరాన్ని కలియుగంలో హస్తినాపురం ఇంద్రప్రస్తం నిర్మించారు. అలాగే పాండవులు నివసించిన మాయసభను కూడా విశ్వకర్మలే నిర్మించారు. ప్రస్తుతం కలియుగంలో ప్రాచీన దేవాలయాలు, పురాతన కట్టడాలు కూడా విశ్వకర్మలే సృష్టికర్తలుగా ఉన్నారన్నది నగ్నసత్యం. ఇంతటి చరిత్ర గల విశ్వకర్మలు నేడు ఎందుకో వెనుకబడ్డారు.

రెడీమేడ్ వస్తువులదే రాజ్యం.. 

రెడీమేడ్ వస్తువులు మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయడంతో విశ్వకర్మలకు చేతినిండా పని కరువైంది. బ్రతుకు తెరువు కోసం పనిని వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పోషణకు కాయ కష్టం చేసే దుస్థితి నెలకొంది. నాడు గొప్పగా బతికిన విశ్వకర్మలు నేడు జీవనోపాధి కోసం ఎదురుతిన్నులు కాస్తున్నారు. రెడీమేడ్ ఫర్నిచర్ విక్రయించే హార్డ్వేర్ షాపులు ఇబ్బడి ముబ్బడిగా నెలకొనడంతో ఫర్నిచర్ కోసం వడ్రంగులను ఆశ్రయించే అవకాశం కనుమరుగైంది. ఇంటికి సంబంధించి చౌకోట్లు, దర్వాజలు,కిటికీలు ఇతరాత్ర ఇంటీరియర్ ఫర్నిచర్ కావాలంటే రెడీగా దొరికే రెడీమేడ్ షాపులను ఆశ్రయించేందుకు వినియోగదారులు ఉత్సాహం చూపుతున్నారు. పనితనం ఉన్న వడ్రంగులు తమ తమ షాపుల్లో పని కోసం ఎదురుచూస్తున్నారు.

రెడీగా దొరికే పసిడి ఆభరణాలు..

దళ దళ మెరిసే పసిడి ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారులు రెడీమేడ్ బంగారు ఆభరణాలు మస్తుగా మార్కెట్లో దొరకడంతో కంసాలిల పాత్ర గుర్తింపు లేకుండా పోయింది. నాసిరకంగా దొరికే రెడ్ పేడ్ బంగారు ఆభరణాలకే జనం ముగుచూపడంతో నాణ్యతతో పనితనాన్ని ఒన గూర్చి బంగారు ఆభరణాలను తయారు చేసే స్వర్ణ కారు పని లేక సమస్యలతో సతమతమవుతున్నారు.చేతి వృత్తిని నమ్ముకున్న వీరికి కడుపునిండా తిండి లేని దయనీయ స్థితి నెలకొంది.

రెడీమేడ్కు తోడు పసిడి ధర ఆకాశాన్ని అంటడంతో బంగారం కొనుగోలు చేసేందుకు సామాన్య ప్రజానీకం వెనుకంజ వేయడం కూడా స్వర్ణకారువృత్తికి ఆటంకంగా మారింది. బెంగాలీ గుజరాత్ ప్రాంతాల్లోని మార్వాడి వ్యాపారులు 2000 బంగారు ఆభరణాల షాపులను ఏర్పాటు చేసుకుంటూ స్వర్ణకారుల చేతువృత్తికి చెక్ పెట్టేసారన్న ఆందోళన విశ్వకర్మల నుండి వినిపిస్తోంది.

కమ్మరి,కంచరి, శిల్పి  పని వారిపై ప్రభావం 

ఎన్నో రకాలుగా ఇత్తడి రాగి స్టీలు వంట సామాగ్రి పూజా సామాగ్రి వస్తువులు మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడడంతో కమ్మరి,కంచరి పనివారికి కూడా చేతినిండా పని కరువైంది. నిత్యం ఇనుప పనిముట్లు తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యే కమ్మరులు కొలిమిలను చూస్తూ నివ్వరపోతుండగా, రకరకాల స్టీలు ఇత్తడి రాగి వస్తువులు రెడీమేడ్ షాపుల్లో దళ దళ మెరుస్తుండగా కంచరి పనివారు పని లేక పస్తులు ఉండే దుస్థితి నెలకొంది.

ఇకపోతే తమిళనాడు ఇతర రాష్ట్రాల నుండి శిల్పి కళాకారులు తెలంగాణలో రంగ ప్రవేశం చేయడంతో ఇక్కడి దేవాలయాలు, విగ్రహాల తయారీ విషయంలో శిల్పులకు కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్ళ విగ్రహాలను తయారు చేసే శిల్పులు బ్రతుకుతెరువు కోసం భగవంతునిపై భారం మోసే పరిస్థితి నెలకొంది.

విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు కలేనా...?

విశ్వకర్మల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మలకు అన్ని రకాల ఆదుకోవాలని లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం గత ప్రస్తుత ప్రతిపాదనలు పెట్టుకున్నప్పటికీ ఏర్పాటు అంశం కలగానే మారుతుంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించాలన్న అంశం కూడా అటుకెక్కింది. రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల కింద వచ్చే విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాకపోవడంతో వృత్తి ఉద్యోగాలు, ఇతరాత్రా అంశాల్లో కూడా లబ్ధి పొందలేకపోతున్నారు. లోగడ టిఆర్‌ఎస్ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కూడా నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపింది.

పలు దఫాలుగా రాష్ట్ర నాయకత్వం వినతులు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల సమయంలో మాత్రం విశ్వబ్రాహ్మణ సంఘాల ఆశ్రయించి ఓట్లు దండుకోవడమే తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకుందామన్న ధ్యాస అప్పటి పాలకులకు లేకుండా పోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే తోవన పయనిస్తూ విశ్వకర్మల కార్పొరేషన్ ఏర్పాటుపై సోయి లేకుండా ఉన్నారన్న విమర్శ సైతం వినిపిస్తోంది.

మిగతా కులాల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నట్లు విశ్వబ్రాహ్మణులైన ఐదు కులాల వారికి కార్పొరేషన్ ఏర్పాటు అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అవకాశం ఉంటుందన్న సంఘ నేతల విజ్ఞప్తులు సర్కార్ ముందు బుట్టదాకలవుతు న్నాయి. విశ్వకర్మల సభలు సమావేశాలకు ముఖ్య అతిథులుగా హాజరై అది చేస్తాం ఇది చేస్తామని నమ్మబలకడమే తప్ప చేసిందేమీ లేదన్న ఆరోపణ కూడా తెరపైకి వస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కారు విశ్వకర్మల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను కూడా కేటాయించాలన్న కోరిక విశ్వకర్మల నోట వినిపిస్తోంది.