29 June, 2026 | 3:31 PM

మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐ డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ

29-06-2026 02:49 PM

మంథని, జూన్ 29(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "అన్న - అక్క" మెంటర్‌షిప్ కార్యక్రమంలో భాగంగా, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో( Manthani Government Degree College) సోమవారం ఏఐ (కృత్రిమ మేధ), డిజిటల్ లెర్నింగ్‌పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సిహెచ్. పరిశయ్య ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, "అన్న - అక్క" మెంటర్‌షిప్ కార్యక్రమం విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధం చేస్తుందని తెలిపారు. కళాశాల నోడల్ ఆఫీసర్ కర్నాటి కృష్ణ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతలో ఏఐ పాత్ర కీలకమని, ఇది విద్యార్థులలో సృజనాత్మకతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని మరియు డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.

ఈ శిక్షణలో బీఏ, బీకాం, బీఎస్సీ ఐదో సెమిస్టర్, బీకాం (బిఎఫ్ఎస్ఐ) మూడో సెమిస్టర్ విద్యార్థులు పాల్గొంటున్నారు. రెండు రోజుల శిక్షణ అనంతరం, విద్యార్థులు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌లో భాగంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఏఐ మరియు డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఫ్యాకల్టీ మెంబర్ ముకుందం, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ, అధ్యాపకులు రజిత, శేఖర్, బోధనేతర సిబ్బంది దుర్గరాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.