ఆటలతోనే ఆరోగ్యం
శారీరక దృఢత్వానికి క్రీడలు ఉపయోగం
అలసిన విద్యార్థులకు ఆటలతోనే మానసిక ఉల్లాసం
ఆటలకు సమయం కేటాయించాలని నిపుణుల సూచన
దామరచర్ల, ఆగస్టు 19: విద్యార్థులు తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పట్టడానికి గంటల తరబడి సమయం కేటాయిస్తున్నా.. తల్లిదండ్రులు క్రీడలకు తగిన ప్రాధాన్యతని వ్వడం లేదు. పాఠశాలలో గంటల తరబడి పాఠాలు వింటున్న విద్యార్థులను ఇంటికి రాగానే హోంవర్క్, ట్యూషన్ల పేరుతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. పాఠశాల నుంచి ఇంటికి రాగానే విద్యార్థులు రాయడానికి, చదవడానికి సిద్ధంగా ఉండరు.
అలాంటప్పుడు పిల్లలు చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవడానికి తగిన సమయాన్ని ఇవ్వాలి. పిల్లలకు ఏ క్రీడలో ప్రావీణ్యం ఉందో తెలుసుకొని అవసరమైతే ఆ సమయంలోని క్రీడా మైదానంలోకి తీసుకెళ్లి ఆడించాలి. క్రీడలతో పిల్లలు శారీరకంగా, ధృడంగా తయా రవడంతో పాటు, ఆరోగ్యంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కల్గుతోంది. దీంతో చదువులో రాణించేందుకు అవకాశం ఏర్పడుతోంది.
ఏ క్రీడతో.. ఏం ఉపయోగం:
కబడ్డీ: కబడ్డీ ఆడడం వల్ల శారీరక ధృడత్వం పెరిగి రక్తప్రసరణ వృద్ధి చెందుతుంది. శరీరం నుంచి మలినాలు బయటకు వెళ్లి ఎముకలు బలపడతాయి.
ఖోఖో ఆడేటప్పుడు పరిగెత్తాల్సి ఉంటుంది. ఆలా పరిగెత్తినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల రక్తంలోకి వెళ్లే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఈ క్రీడ కాళ్లకుమంచి వ్యాయామం. శారీరక ప్రతిస్పందనలు మెరుగవుతాయి.
టెన్నికాయిట్ : టెన్నికాయిట్ ఆడేటప్పుడు బాల్ను పట్టుకునేందుకు
అటు ఇటు జంప్ చేయాలి. అలా చేసేటప్పుడు శరీరంలోని అన్ని భాగాలకూ వ్యా యామం అవుతుంది. ఊపిరితిత్తులకు గాలి సరఫరా మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. చేతులకు ఇది మంచి వ్యాయామం.
ఫుట్ బాల్ : అన్ని క్రీడలు ఆడితే వచ్చే ప్రయోజనం ఒక్క ఫుట్బాల్ ఆడితే వస్తుంది. బాల్ తన్ని పరిగెత్తేటప్పుడు శరీరంలోని అన్ని భాగాలు కదులుతాయి. దీని వల్ల మనసు, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. బృందం స్పూర్తి అలవడుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతోంది.
పరుగు : ఊపిరితిత్తులు, గుండె సామర్థ్యం పెరుగుతుంది. కండరాలు వృద్ధి చెందుతాయి. చురుకుదనం పెరుగుతుంది. రక్తప్రసరణలో ఇబ్బంది ఉండదు. ఊబకాయం రాదు.
వాలీబాల్ : చేతి కండరాలకు, కాళ్లకు మంచి వ్యాయామం. లక్ష్య సాధన, బృంద స్పూర్తి అలవడతాయి.
బాస్కెట్ బాల్ : కాళ్లకు, చేతులకు మంచి వ్యాయామం. ఛాతి, కడుపు కండరాలు అదుపులో ఉంటాయి. శరీరంలో సాగుదల తత్వం అలవడుతుంది. అంతర్గత అవయవాల పటుత్వం కూడా పెరుగుతుంది.
టేబుల్ టెన్నిస్ : శరీరానికి, మనసుకు మధ్య సమన్వయం పెరుగుతోంది. కాళ్లకు, చేతులకు, పొట్టకు మంచి వ్యాయామం. కళ్లకు మంచిది. లక్ష్యంపై గురి పెట్టడం అలవడుతోంది.
చదరంగం : ఇది మేధోక్రీడ. సమస్య సాధనకు ఎక్కువ పరిష్కార మార్గాలు అన్వేషించడం, సమస్యను ముందుగా ఆలోచించి దానికి తగ్గ ఎత్తులు వేయడం ద్వారా ఆలోచనాశక్తి పెరుగుతుంది.
క్యారమ్స్ : దీని వల్ల మెదడు, శరీర భాగాల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగి లక్ష్యాన్ని గురిపెట్టడం అలవడుతుంది.






