రాళ్ళ గుట్టలపై డేగల కన్ను

04-10-2026 | 07:48pm

- అటవీ భూముల్లో రాళ్ళ కోసం బ్లాస్టింగులు

- మామూళ్ల మత్తులో మైనింగ్, రెవెన్యూ, ఆర్టీవో, అటవీశాఖలు 

బిజినేపల్లి, అక్టోబర్04 : మామూళ్ల మత్తులో పడి ఆయా శాఖల అధికారులు నిద్ర పోతుంటే మైనింగ్  మాఫీయా(Mining mafia) కొండల్లో బ్లాస్టింగులు చేసి సైజ్ రాళ్ళుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కొండల్లో బ్లాస్టింగులు(Blasting operations), రవాణా బహిరంగంగా పట్ట పగలే చేస్తుంటే నాలుగు శాఖల్లో ఒక శాఖ అధికారి కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఒక్కొక్క శాఖకు బిజినేపల్లి మండలం(Bijinapally Mandal) నుండియే రూ. లక్ష వరకు మమ్ముళ్ళు అందిస్తున్నట్లు జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

బేసుమెంటు సైజ్ రాయి కొట్టిన కూలీకి ఒక్కొక్క రాయికి రూ.10 లోపు ఇస్తుండగా వ్యాపారం చేసే అక్రమార్కులు ఒక్కో రాయికి రూ.35 నుండి రూ.40 విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. వీరు మండల వ్యాప్తంగా వందల సంఖ్యలో ట్రాక్టర్లు, జేసిబీలను పెట్టి బ్లాస్టింగులు చేసి సైజ్ రాళ్ళు తయారు చేస్తున్నారు.

అంధకారంలో రవాణా శాఖ 

నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లల్లో సైజ్ రాళ్ళను నింపి బీజినేపల్లి నుండి నాగరుకర్నూలు, వనపర్తి, భుత్పూర్, జడ్చర్ల పట్టణాలకు ప్రధాన రహదారుల గుండా రవాణా చేస్తుంటే ఒక్క అధికారికి కూడా ఈ దృశ్యాలు కనిపించవు. ఇదిలా ఉంటే నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లు రోజు పదుల సంఖ్యలో పట్ట పగలే రోడ్లపై తిరుగుతుంటే ఏదైనా ప్రమాదాలకు కారణం అయితే బాధ్యులెవరు అవుతారు.

రెవెన్యూలో తెలియనట్టుగా

ప్రభుత్వ భూములు అన్ని తమ ఆధీనంలో ఉన్నా ఒక్క రెవెన్యూ అధికారి కూడా క్షేత్ర స్థాయిలో తమకేమీ తెలియనట్టుగా ఉంటున్నారు. ప్రభుత్వ భూముల్లో  ఏమి జరుగుతుందో అని పత్రికల్లో కథనాలు, పిర్యాదులు వచ్చినా తమకు ఇప్పుడే కొత్తగా తెలిసింది అనేలా ముఖ కవళికలు ఉంటాయి. కానీ క్షేత్ర స్థాయిలో స్వతహాగా ఒక కేసు కానీ, విచారణ కానీ చేయకుండా మరో శాఖపైకి సమస్యను నెట్టుతారు. మామూళ్ళు సమయానికి రాకుంటే అప్పుడు వీళ్ళ ప్రతాపం చూపిస్తారు. 

బ్లాస్టింగుల బయంలో అడవి

గంగారం, లట్టుపల్లి, శాయిన్ పల్లి, మమ్మాయిపల్లి గ్రామాల శివారుల్లో అడవి రాత్రిళ్ళు భయంతో బిక్కుబిక్కుమంటుంటే అధికారులు జీవ వైవిద్యంతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. అడవిలో రాళ్ళు కొట్టడానికి వెళ్ళిన కూలీలు జంతువులను, పక్షులను వెంటాడుతున్నారు. అడవిలో రాళ్ళతో పాటు జంతువులు మాయం అవుతున్నాయి.

కన్నెత్తి చూడని మైనింగ్

వ్యాపారులు కొండలను ఒక వైపు పిండి చేసి లాభాలు పండిస్తుంటే మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కొండలు పిండి అయినట్టు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తే, ఇందుకు కారణం అయిన వ్యాపారులు ఎవరూ అనే విషయమై ఒక లోతైన విచారణ లేదు. విచారణ చేసి కేసులు నమోదు చేస్తే వ్యాపారుల నుండి రూ. కోట్లల్లో రాయల్టీ వసూళ్లు చేయవచ్చు. కానీ వీరు ఆ పని చేయరు. జస్ట్ అలా పై పెచ్చు విచారణ చేసి ఎవరో అక్రమార్కులు కొండలు పిండి చేశారని రిపోర్ట్ రాసుకొని పోతారు.

కలెక్టరైన కన్ను పెడుతాడా ..!

రాళ్ళ కోసం అడవిలో, ప్రభుత్వ స్థలాల్లో కొండలను పిండి చేసి వ్యాపారులు ఆయా శాఖల అధికారుల జేబులు నింపుతుంటే కనీసం కలెక్టర్ అయిన ఒక కన్ను పెట్టి ఈ ప్రకృతిని కాపాడుతారా అని పలువురు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు