బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు

05-05-2024 01:38:33 AM

మతం పేరుతో బీజేపీ రాజకీయాలు

కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి

మంత్రి సీతక్క 

ఆదిలాబాద్, మే 4 (విజయక్రాంతి): మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బంగారిగూడ, యాపల్‌గూడ, అంకోలి, పిప్పల్‌దరి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల పదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిన మేలు సున్నా అని ధ్వజమెత్తారు. ఒక్క అయోధ్యలో ప్రజల సొమ్ముతో రామ మందిరం కట్టించిందని, పేద ప్రజల కోసం మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ నాయకురాలు ముడుపు నళినీరెడ్డి, కంది మౌనికారెడ్డి పాల్గొన్నారు.