4 September, 2026 | 5:37 AM

సిద్దిపేట సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి నిర్లక్ష్యం

04-09-2026 | 04:35am
  1. రైతుల భూములకు 22ఏ చిక్కుముడి 
  2. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై గజ్వేల్లో బీఆర్‌ఎస్ వంటావార్పులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డ్డి ఫైర్

సిద్దిపేట, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) /గజ్వేల్, చేర్యాల : కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గజ్వేల్లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి చేసిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టులను నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పటివరకు పరిశీలించలేదని ఆరోపించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలను నింపి సాగునీటి వసతులను మెరుగుపరిచామని, ప్రస్తుత ప్రభుత్వం కాల్వలు, సాగునీటి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

22ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చడంతో రైతులు తమ అవసరాలకు భూములు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వైద్యం, పిల్లల చదువులు, వివాహాలు వంటి అత్యవసర అవసరాల కోసం భూములు విక్రయించాలన్నా రిజిస్ట్రేషన్ల సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో మోడల్గా అభివృద్ధి చేసిన గజ్వేల్ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కొత్త ప్రభాకర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

సిద్దిపేటలో..

రైతులను ఇబ్బందులు కలిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యమంలో బిఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కోట్లాడి తెచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేని హామీలిచ్చి గద్దెనెక్కి ప్రజలకు ఇబ్బందులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. సిద్దిపేట వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకు మరో ఉద్యమం తప్పదని ప్రకటించారు. 

చేర్యాలలో..

కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఆరు గ్యారంటీల ను అమలు చేయలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. చేర్యాలలో జరిగిన మహా ధర్నాలో మాట్లాడుతూ రైతు బంధు ఎగ్గొట్టారని, రైతు బీమా నిలిపివేశారని, వరి బోనస్ లో మాట తప్పారని అన్నారు. తపాస్ పల్లి నింపలేకపోవడం, కరెంట్ కోతలు, రూ.2 లక్షల రుణమాఫీలో కోత, మహిళలకు రూ.2500, తులం బంగారం, డిఏస్సీ హామీలు మోసం చేశారని ఆరోపించారు. 22ఏ తో పేదల భూములను ఇబ్బంది పెడుతున్నారని, రేవంత్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.