అవినీతి, అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం రండి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): వెయ్యి రోజుల ప్రజాపాలన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై, బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధంగా ఉండాలని, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) సవాల్ విసిరారు.
గురువారం ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 డిసెంబర్ లో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. వెయ్యి రోజులుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ యాస భాషతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీని ఏక వచనంతో సంబోధించడం కేటీఆర్, హరీష్ రావుల అహంకారానికి నిదర్శనమని అన్నారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి తెలిపారు. గతంలో మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఏనాడు ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరో పించారు. ధర్మపురి నియోజకవర్గ వెయ్యి రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ మాజీ మంత్రి కొ ప్పుల ఈశ్వర్ కి పంపిస్తున్నానని తెలిపారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని రానున్న రోజుల్లో రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అవుతారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సాగౌడ్, వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, పెగడపల్లి మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంట సుధాకర్, నాయకులు వేముల రాజు, తదితరులు పాల్గొన్నారు.






