4 September, 2026 | 6:29 AM

భద్రాద్రికి రైలుబాట.. అభివృద్ధికి తొలి అడుగు

04-09-2026 | 05:35am
  1. పాండురంగాపురం మల్కన్‌గిరి రైల్వే లైన్లో సాకేతపురి వరకు పనులకు గ్రీన్ సిగ్నల్ 
  2. సుమారు 16 కి.మీ. మేర రైల్వే లైన్ పనులను ముందుగా చేపట్టాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి
  3. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
  4. రైల్వే కనెక్టివిటీతో భద్రాచలానికి ఆధ్యాత్మిక పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) అభివృద్ధికి కీలకమైన పాండురంగాపురం మల్కన్గిరి రైల్వే లైన్కు(Pandurangapuram-Malkangiri railway line) మరోసారి కదలిక వచ్చింది. వివిధ కారణాలతో పూర్తి ప్రాజెక్టు ఆలస్యమవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత దశలో పాండురంగాపురం నుంచి మధ్యలోని సాకేతపురి (సారపాక) వరకు సుమారు 16 కి.మీ. రైల్వే లైన్ పనులను(Railway line works) ముందుగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను(Ashwini Vaishnaw) కోరారు. మంత్రి తుమ్మల విజ్ఞప్తిపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి, ఈ మార్గంలో పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పూర్తి ప్రాజెక్టుకు పలు అవరోధాలు..

రైల్వే మంత్రితో జరిగిన చర్చలో పాండురంగాపురంమల్కన్గిరి రైల్వే లైన్ ప్రస్తుత పరిస్థితిని మంత్రి తుమ్మల వివరించారు. గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్ హయాంలోనూ ఈ రైల్వే లైన్ ప్రతిపాదనకు అనుకూలత లభించినప్పటికీ.. వివిధ కారణాలతో పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదని తెలిపారు.

భూసేకరణ, అటవీశాఖ అనుమతులు, గోదావరి వంతెనతో పాటు ఇతర రైల్వే వంతెనల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియలు పూర్తి ప్రాజెక్టుకు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిష్కరించి పాండురంగాపురంమల్కన్గిరి పూర్తి రైల్వే లైన్ను నిర్మించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

సాకేతపురి వరకు ముందుగా పనులు..

అయితే పాండురంగాపురం నుంచి సాకేతపురి (సారపాక) వరకు సుమారు 16 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మాణానికి పెద్దగా అవరోధాలు లేనందున.. ఈ దశలో ఆ పనులను ముందుగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల కోరారు. పాండురంగాపురంసాకేతపురి మధ్య రైల్వే లైన్కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి, అవసరమైన భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి తెలిపారు.

తుమ్మల విజ్ఞప్తికి తక్షణ స్పందన..

మంత్రి తుమ్మల విజ్ఞప్తిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పాండురంగాపురంసాకేతపురి మార్గంలో పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులను ఆదేశించారు. దీంతో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భద్రాద్రి ప్రాంత రైల్వే కనెక్టివిటీకి తొలి అడుగు పడినట్లయింది.

భక్తులకు మరింత చేరువలో భద్రాచలం..

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఈ రైల్వే మార్గం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. సాకేతపురి వరకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తే భద్రాచలం ప్రాంతానికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. రైల్వే కనెక్టివిటీతో భద్రాచలంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. భద్రాచలం, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యాటక కార్యకలాపాలు విస్తరించడంతో పాటు.. భక్తులు, పర్యాటకుల రాక పెరగడం ద్వారా స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగుపడనున్నాయి.

పారిశ్రామిక రంగానికి రవాణా బలం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పారిశ్రామిక రంగానికి కూడా రైల్వే కనెక్టివిటీ కీలకంగా మారనుంది. సింగరేణి, బీపీఎల్, వాటర్ ప్లాంట్లు, కేటీపీఎస్ తదితర పరిశ్రమలకు ముడిసరుకు, ఉత్పత్తుల రవాణా మరింత సులభతరం కానుంది. రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది.

భూసేకరణకు రాష్ట్రం సిద్ధం..

కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో పాండురంగాపురంసాకేతపురి మధ్య భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, అవసరమైన భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. పాండురంగాపురంమల్కన్గిరి రైల్వే లైన్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగుతున్న క్రమంలో.. ఈ దశలో సాకేతపురి వరకు రైల్వే లైన్ అందుబాటులోకి రావడం భద్రాద్రి ప్రాంత అభివృద్ధికి కీలక మలుపుగా నిలవనుంది. ఆధ్యాత్మిక పర్యాటకం, పారిశ్రామిక ప్రగతి, స్థానిక ఉపాధి, వ్యాపార అవకాశాలకు ఈ రైల్వే కనెక్టివిటీ మరింత బలాన్నివ్వనుంది.