22 June, 2026 | 4:48 PM

రైతులకు న్యాయం చేయాలి

22-06-2026 03:37 PM

పీసీసీఎఫ్ డా. సి. సువర్ణను కలిసి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే కోవలక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన రైతులతో కలిసి ఎమ్మెల్యే కోవలక్ష్మి సోమవారం హైదరాబాద్‌లోని ఫారెస్ట్ భవన్‌లో ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్  డా. సి.సువర్ణను కలిసి రైతుల సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయా మండలాలకు చెందిన వందలాది కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయమే వారి ప్రధాన జీవనాధారం అని, ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కుటుంబాలన్నీ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.

అటవీ శాఖ చర్యల కారణంగా రైతులు సాగు చేస్తున్న భూములను కోల్పోతే వందల సంఖ్యలో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని వారికి న్యాయం చేయాలని పీసీసీఎఫ్‌ను కోరారు. ఈ ఏడాది ఇప్పటికే విత్తనాలు వేసి సాగు ప్రారంభించిన రైతుల పొలాలకు అటవీ శాఖ అధికారులు వెళ్లి ఇబ్బందులు కలిగించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.రైతుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.