ఆలేరులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నఎమ్మెల్యే
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఆలేరు(Aleru) గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్(MLA Dr Murali Naik) సందర్శించారు. ఆలేరు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నుల పండువగా ప్రారంభించారు. గ్రామంలో కొలువై ఉన్న అత్యంత పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి(Venugopala Swamy) ఆలయాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారిని దర్శించుకుని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమాల అనంతరం, ఆలయ ప్రాంగణంలో కొత్తగా చేపడుతున్న పునరుద్ధరణ పనులు, ఆలయ అభివృద్ధిలో భాగంగా చేస్తున్న ఆధునిక మార్పులను ఎమ్మెల్యే (MLA)పరిశీలించారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఆలయం పవిత్రతను కాపాడుతూనే, భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆయన సూచించారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు.






