4 September, 2026 | 2:07 PM

1000 రోజుల ప్రజా పాలన ప్రజల విజయానికి నిదర్శనం

04-09-2026 | 01:16pm

బోధన్, సెప్టెంబర్ 04(విజయ క్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాపాలన(Peoples Governance) పూర్తి చేసుకున్న సందర్భంగా టీపీసీసీ(TPCC) ప్రతినిధి గంగా శంకర్ మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ 3న ప్రజలు వేసిన ఓటుతో పదేళ్ల పాలనకు ముగింపు పలికి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. ప్రగతి భవన్(Pragathi Bhavan) స్థానంలో ప్రజా భవన్(Praja Bhavan) ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

1000 రోజుల పాలనలో రైతులు, మహిళలు, పేదలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని గంగా శంకర్ తెలిపారు. రూ.25 లక్షల రైతు కుటుంబాలకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు.

మహిళల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్(Gas cylinder), 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్(Free Electricity) వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా వివిధ ప్రభుత్వ నియామక ప్రక్రియల ద్వారా వేలాది ఉద్యోగాలు భర్తీ చేశామని గంగా శంకర్ పేర్కొన్నారు. DSC, గ్రూప్-1, పోలీస్ తదితర నియామకాల ద్వారా యువతకు అవకాశాలు కల్పించామని తెలిపారు.

సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టపరమైన చర్యలు చేపట్టామని అన్నారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రపంచ స్థాయి రహదారులు, మూసీ పునరుజ్జీవనం వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ ప్రతినిధి గంగా శంకర్ పేర్కొన్నారు.