4 September, 2026 | 2:01 PM

బోయినపేటను విస్మరిస్తున్న విద్యుత్ అధికారులు

04-09-2026 | 01:22pm

ప్రజల ప్రాణాలతో చెలగాటమా

సమస్యలు పరిష్కరించకుంటే విద్యుత్ కార్యాలయం ముట్టడి..

నిరాహార దీక్షకు సిద్ధం

6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి హెచ్చరిక

మంథని, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): మంథని మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని బోయినపేట ప్రాంతంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యలను అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలపై విద్యుత్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన చోట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలను తొలగించి నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపై ఉందన్నారు.

బోయినపేటలోని పలు వాడల్లో విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు చిమ్మచీకటిలోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొందని శ్రీలతక్రాంతి తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రి సమయంలో బయటకు రావడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. చీకటి కారణంగా విషపూరిత పాములు, ఇతర జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు.

కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయని, మరికొన్ని చోట్ల పాత ఇనుప స్తంభాలు శిథిలావస్థకు చేరడంతో ప్రజలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు, ఈదురుగాలులు, గాలిదుమారాల సమయంలో బలహీనంగా ఉన్న స్తంభాలు విరిగిపడితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

అలాగే బోయినపేటకు వెళ్లే ప్రధాన రహదారి అయిన పాత కట్టపై విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో రహదారి మొత్తం చీకటిగా మారుతోందన్నారు. ఈ మార్గంలో నిత్యం ప్రజలు, వాహనదారులు ప్రయాణిస్తున్నప్పటికీ సరైన వెలుతురు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదాలు జరగకముందే అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

బోయినపేటలో విద్యుత్ సమస్యలు నిన్న మొన్నటివి కావని, చాలా కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీలతక్రాంతి పేర్కొన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇకనైనా అధికారులు స్పందించి బోయినపేటలోని అన్ని వాడలను క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యుత్ స్తంభాలు, తీగలు, వీధి దీపాలు, మీటర్ కనెక్షన్లకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రజలను సమీకరించి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమని శ్రీలతక్రాంతి స్పష్టం చేశారు.