calender_icon.png 9 May, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంకు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గ్రాంటు

19-03-2025 01:36:43 AM

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదుకు మరో ప్రతిష్ఠాత్మక పరిశోధనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ మంజూరు చేసింది. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ)లోని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్‌ఆర్‌ఎఫ్) గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతాహర్ రెజాకు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసినట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

‘తిరిగే వక్ర మైక్రో పైపులలో ప్రవాహ అస్థిరతల అధ్యయనం’ పేరిట చేపట్టే ఈ ప్రాజెక్టు, అధునాతన సంఖ్యా, విశ్లేషణాత్మక పద్ధతులను ఉపయోగించి మైక్రోడొమైన్ లలో ద్రవ ప్రవాహ ప్రవర్తనను మూడేళ్ల కాల పరిమితితో పరిశోధించడానికి ఉద్దేశించినదని తెలిపారు. ఈ పరిశోధనలో డాక్టర్ రెజాకు సహాయకారిగా ఉండేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) అవసరమని తెలిపారు.

ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ (గణితం) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, గేట్ లేదా నెట్ అర్హతతో పాటు మ్యాట్ ల్యాబ్ ప్రోగ్రామింగ్‌లో ప్రావీణ్యం ఉన్న 32 ఏళ్ల వయస్సు లోపు వారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు, మహిళలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

జేఆర్‌ఎఫ్‌గా ఎన్నికైన వారికి నెలవారీ రూ.37 వేల భత్యంతో పాటు ఇంటి అద్దె అలవెన్సు కూడా ఇస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డాక్టర్ రెజా 78730 49059ను సంప్రదించాలని, లేదా mreza@gitam.edu or motaharreza90@gmail.com కు ఈ-మెయిల్ దరఖాస్తు చేయాలని సూచించారు.  డాక్టర్ రెజాను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ అభినందించారు.