6 July, 2026 | 5:39 PM

ఎస్‌ఐఆర్ విధుల్లో నిర్లక్ష్యం

06-07-2026 05:02 PM

ఆరుగురు వీఏఓలు సస్పెండ్

బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించాలి: డీఆర్‌డీవో బి. దాత్తరావు

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామీణ అభివృద్ధి శాఖ సిబ్బంది బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి. దాత్తరావు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందిన వీఏఓలు, సీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి గ్రామంలో బీఎల్‌వోలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలోని గ్రామాల్లో బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఓటరు వివరాల పరిశీలన, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు వంటి కార్యక్రమాల్లో సంబంధిత సిబ్బంది చురుకుగా పాల్గొనాలని దాత్తరావు తెలిపారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను సకాలంలో, పారదర్శకంగా పూర్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఎస్‌ఐఆర్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన డీఆర్‌డీవో, కాగజ్‌నగర్ మండలంలోని గ్రామ సంస్థల్లో పనిచేస్తున్న ఆరుగురు వీఏఓలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.ఎన్నికల ఓటరు జాబితా సవరణల్లో అలక్ష్యం ప్రదర్శించినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.సస్పెండ్ అయిన వీఏఓలు వీరే:- ముర్రడి రాజేశ్వర్ – వంజరి,బిక్కుమై దేవన్ – మోసం,పోతు బీములు –కొయ్యగూడ,గిరి – కొయ్యగూడ,సోగాల శ్రీనివాస్ – అంకుసాపూర్,అలకం అత్రం – గొంది ఉన్నారు.