18-02-2026 01:33:48 AM
ముంబై, ఫిబ్రవరి 17: నేపాల్ క్రికెట్ చరిత్రలో ఈ టీ20 ప్రపంచకప్ చిరస్థాయి గా నిలిచిపోతుంది. అసలు ఏమాత్రం అంచ నాలు లేకుండా వచ్చిన నేపాల్ మెగాటోర్నీలో తొలి విజయాన్ని రుచి చూసింది. తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్ పై సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు జార్జ్ మున్సే, మైకేల్ జోన్స్ దుమ్మురేపారు. తొలి వికెట్‌కు 10 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు.
వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపూ స్కాట్లాండ్ 200కు పైగా స్కోర్ చేస్తుందనుకున్నారు. చివర్లో నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో స్కాట్లాండ్ 20 ఓవర్లలో 170 పరుగులే చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కమి 3, నందన్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో నేపాల్ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓపెనర్లు కుశాల్, ఆసిఫ్ షేక్ తొలి వికెట్ కు 74 పరుగులు జోడించారు. కుశాల్ 35 బంతుల్లో 4 సిక్సర్లు,1 ఫోర్ తో 45 , ఆసిఫ్ షేక్ 27 బంతుల్లో 33 పరుగులకు ఔటైనప్పటకీ.. తర్వాత దీపేంద్రసింగ్ , గుల్షన్ ఝా కీలక భాగస్వామ్యంతో జట్టు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో టీ20 ప్రపంచకప్ లో తొలి విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది.