రామప్పకు కొత్త అందాలు
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప సరస్సు పరిసర ప్రాంతాలు త్వరలో మరింత సుందరంగా మారనున్నాయి. సరస్సు మధ్యలో ఉన్న దీవి త్వరలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న రామప్ప సరస్సు మధ్యలోని ఏడెకరాల దీవిని ప్రభుత్వం ఆధునిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నది.
సాస్కీ స్కీం కింద రూ.13 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రకృతి సోయగాలు, పచ్చదనం, ఆధ్యాత్మికత, ఆధునిక సౌకర్యాల సమ్మేళనంగా ఈ దీవిని తీర్చిదిద్దుతున్నారు. ఈ దీవి భవిష్యత్తులో రాష్ట్ర పర్యాటక రంగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది.
ఏడు ఎకరాల విస్తీర్ణంలో..
రామప్ప సరస్సు మధ్యలో సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలోని ఐలాండ్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నది. ప్రకృతి అందాల నడుమ ఏర్పాటైన ఈ దీవిని ప్రభుత్వం సుందరీకరించి ఆధునిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నది. చుట్టూ నీరు, పచ్చదనం మధ్య ఆహ్లాదకర వాతావరణంలో విస్తరించిన ఈ ఐలాండ్ లో పాత్వేలు, గార్డెన్లు, మండపాలు, వినోద సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. బోటింగ్ ద్వారా చేరుకునే ఈ దీవి భవిష్యత్తులో రామప్ప పర్యాటకానికి ప్రధాన ఆకర్షణగా మారనున్నది.
ఆకట్టుకొనున్న శివపార్వతుల విగ్రహం
ఈ దీవిలో ఏర్పాటు చేయనున్న భారీ శివపార్వతుల విగ్రహం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. సుమారు 30 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న ఈ విగ్రహాన్ని ప్రకృతి అందాల నడుమ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్‌తో ఈ విగ్రహాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
త్వరలో పనులు పూర్తి
ఈ సరస్సు మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సాస్కీ స్కీం కింద రూ.13 కోట్లు మంజూరు చేసింది. గత నవంబర్‌లో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించడంతో గుత్తేదారు నిరంతరం పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
బానోత్ యోగి,
విజయక్రాంతి, వెంకటాపూర్






