ముత్తారంలో పుర్తైన నూతన తహసీల్దార్ కార్యాలయం
రైతులు, ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరువ
మంత్రి శ్రీధర్ బాబు కృషితో మౌలిక వసతులకు కొత్త ఊతం
ముత్తారం, సెప్టెంబర్ 16(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ(New Tahsildar Office) భవన నిర్మాణం పూర్తయింది. ఆధునిక వసతులతో నిర్మించిన ఈ భవనం త్వరలో పూర్తిస్థాయి సేవలకు అందుబాటులోకి రానుండటంతో మండల ప్రజలు, ముఖ్యంగా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
ఇప్పటివరకు రెవెన్యూ సంబంధిత పనుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, ప్రజలకు నూతన కార్యాలయం అందుబాటులోకి రావడంతో భూముల రికార్డులు, పట్టాదారు పాస్బుక్ లు, భూ సంబంధిత దరఖాస్తులు, వివిధ ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ సమస్యల పరిష్కారం వంటి సేవలను మండల కేంద్రంలోనే పొందే అవకాశం ఉంటుంది. అలాగే కార్యాలయ భవనంలో తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సేవలకు సంబంధించిన సదుపాయాలు ఉండటం ప్రజలకు మరింత ఉపయోగకరంగా మారనుంది.
మండలంలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చే రైతులు చిన్నచిన్న రెవెన్యూ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కానున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలపై అధికారులను నేరుగా సంప్రదించి పరిష్కారం పొందేందుకు ఈ కార్యాలయం కీలకంగా మారనుంది.
ముత్తారం మండల అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృషితో ఈ మౌలిక వసతి సాకారమైంది.
నూతన భవనం పూర్తవడంతో ముత్తారం మండల రెవెన్యూ వ్యవస్థకు కొత్త రూపు రావడంతో పాటు, రైతుల సమస్యలకు మరింత వేగంగా పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. తాసిల్దార్ నూతన భవనాన్ని మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు మండల రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.