17-02-2026 01:41:02 AM
ఆసీస్ అవకాశాలు సంక్లిష్టం
టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు షాక్ మీద షాక్... జింబాబ్వే చేతిలో ఓడి రెండురోజులైనా గడవకముందే శ్రీలంకపైనా కంగారులు చిత్తయ్యారు. భారీస్కోరు చేసినా పేలవ బౌలింగ్‌తో కాపాడుకోలేకపోయారు. నిస్సాంక సెంచరీతో రెచ్చిపోయిన వేళ వరుసగా రెండో ఓటమి చవిచూసిన ఆసీస్ తన సూపర్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇప్పుడు ఆసీస్ భవిష్యత్తు జింబాబ్వేపై ఆధారపడి ఉంది. జింబాబ్వే ఒక్క మ్యాచ్ గెలిచినా కంగారులు లగేజీ సర్దుకోవడమే.
పల్లెకెలె, ఫిబ్రవరి 16: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫ్లాప్ షో కొనసాగుతోంది. జింబాబ్వే చేతిలో ఓడిన కంగారూలకు తాజాగా ఆతిథ్య శ్రీలంక కూడా దిమ్మతిరిగే షాకిచ్చింది. పల్లెకేలే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో లంక గెలిచిందనే కంటే ఆసీస్ ఓడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఓపెనర్లు అద్భుతమైన పునాది వేస్తేమిగిలిన బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
ఓపెనర్లు మార్ష్ , హెడ్ 8.2 ఓవర్లలో 104 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పితే..మిగిలిన జట్టంతా కలిపి 77 పరుగులే చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మార్ష్ , హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ తో మెరుపు ఆరంభాన్నిచ్చారు. మార్ష్ 27 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 , హెడ్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేశారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ అనూహ్యంగా తడబడింది.
ఇంగ్లీస్ (27), మాక్స్ వెల్(22) తప్పిస్తే మిగిలిన వారంతా నిరాశ పరిచారు. కామెరూన్ గ్రీన్ 3, టిమ్ డేవిడ్ 6 పరుగులకే ఔటవగా.. స్టోయినిస్ కూడా విఫలమయ్యాడు. మాక్స్ వెల్ కూడా చివరి ఓవర్లలో ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా 220 పైగా స్కోరు చేస్తుందనుకుంటే 181 పరుగులే చేయగలిగింది. ఛేజింగ్‌లో శ్రీలంక 8 పరుగులకే కుశాల్ పెరీరా వికెట్ కోల్పోయింది. అయితే నిస్సాంక, కుశాల్ మెండిస్ అదరగొట్టారు.
ఆసీస్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఔటవగా.. నిస్సాంకా మాత్రం తన దూకుడు కొనసాగించాడు. రత్నానాయకేతో కలిసి మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఇదే తొలి శతకం.
అలాగే శ్రీలంక తరపున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. నిస్సాంక జోరుతో శ్రీలంక కేవసం 18 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో శ్రీలంక సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకోగా.. ఆసీస్ ఎలిమినేషన్‌కు చేరువలో నిలిచింది. ఇప్పుడు జింబాబ్వే రెండు మ్యాచ్‌లు ఓడిపోతే ఆసీస్ తన చివరి మ్యాచ్ లో ఒమన్‌పై గెలిస్తే సూపర్ 8కు చేరుకుంటుంది.