గణేష్ ఉత్సవాల్లో డీజేకు నో ఎంట్రీ

11-09-2026 | 12:40pm

డీజే వద్దు.. బాజా ముద్దు

గోదావరిఖనిలో డీజే ఆపరేటర్లతో సీఐ ఇంద్రసేనారెడ్డి

గోదావరిఖని,సెప్టెంబర్,11(విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలను(Ganesh Chaturthi 2026) ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని గోదావరిఖని సీఐ ఇంద్రసేనారెడ్డి(Godavarikhani CI Indrasena Reddy) సూచించారు. ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌కు ఎలాంటి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే ఆపరేటర్లు, యజమానులతో శుక్రవారం పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గణేష్ మండపాల వద్ద సాధారణ సౌండ్ సిస్టమ్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని, మైక్ సిస్టమ్‌ను రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని తెలిపారు.

పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి డీజే సౌండ్ సిస్టమ్‌ను(DJ sound system) వినియోగిస్తే సంబంధిత డీజే ఆపరేటర్లు, యజమానులు, మండప నిర్వాహకులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘనకు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీజే ఆపరేటర్లు, యజమానులను బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని, పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సీఐ కోరారు. డీజేకు దూరంగా ఉండి,బాజాతో భక్తి భావాన్ని చాటుకుందాం. ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందుదాం అని సీఐ ఇంద్రసేనారెడ్డి ఆకాంక్షించారు.


మరిన్ని వార్తలు