ఆపరేషన్ ముస్కాన్
ఇద్దరు చిన్నారులకు విముక్తి
హోటళ్లు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు
ఎర్రవల్లి: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలో నిర్వహించిన 'ఆపరేషన్ ముస్కాన్-12' ప్రత్యేక తనిఖీల్లో ఇద్దరు చిన్నారులను అధికారులు రక్షించారు. స్థానిక హోటళ్లు, వాణిజ్య దుకాణాల్లో సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఒక బాల కార్మికుడు, చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న మరో బాలుడిని గుర్తించి విముక్తి కల్పించారు.అనంతరం ఇద్దరు చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపరచగా, కమిటీ ఆదేశాల మేరకు తాత్కాలిక సంరక్షణ కోసం ఆనందనిలయానికి తరలించారు.
ఈ తనిఖీల్లో ఎస్ఐ శేఖర్, పోలీసు సిబ్బంది భరత్, సుధారాణి, కార్మికశాఖ అధికారి అయ్యన్న, చైల్డ్ లైన్ ప్రతినిధి నవీన్, డీసీపీయూ అధికారి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు చిన్నారుల హక్కుల పరిరక్షణకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. బాల కార్మికులను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






