రైతులకు గుడ్ న్యూస్.. వరి బోనస్..?
ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం నిర్ణయించిన వరి రకాలైన తెలంగాణ సోనా (RNR 15048), సాంబా మసూరి (BPT 5204), KNM 1638, HMT సోనా, జై శ్రీరామ్, WGL 44, KNM 7715 రకాలను సాగు చేస్తున్న రైతులు తమ పంట వివరాలను ఆన్‌లైన్‌లో ఈ నెల 17వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు(Mandal Agriculture Officer Arun Babu) శనివారం సూచించారు. డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, విత్తనాలు కొనుగోలు బిల్లు తీసుకుని, విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.
అలాగే, సొంత విత్తనం లేదా ఇతర రైతుల నుంచి పొందిన విత్తనాలను వినియోగించే రైతులు రైతు ధృవీకరణ పత్రంతో పాటు సంబంధిత వివరాలను తమ పరిధిలోని AEOకి సమర్పించాలని సూచించారు. నమోదు చేసిన వివరాలను సివిల్ సప్లైస్ శాఖకు అందజేయడం జరుగుతుందని, పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతులకే క్వింటాల్‌కు రూ.500 బోనస్ పొందేందుకు అర్హులు అవుతారని తెలిపారు. ములకలపల్లి మండలంలో వరి సాగు చేస్తున్న రైతులందరూ నిర్ణీత గడువులోగా తమ పంట వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని ఆయన కోరారు.