రామ్‌చరణ్‌తో స్టెప్పేస్తే ఒక్క పూటలో బరువు తగ్గొచ్చు!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ ఈ మూవీటీమ్ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా సోమవారం బెంగళూరులో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హోస్ట్‌ను పలు ప్రశ్నలు అడగ్గా.. వారు తమదైన శైలిలో స్పందించారు.
ముఖ్యంగా ‘అమ్మాయిలకు మీ డైట్ సీక్రెట్ గురించి చెప్పండి’ అని హోస్ట్ అడిగితే.. ‘రామ్‌చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తే ఒక్క పూటలోనే బరువు తగ్గొచ్చు’ అంటూ జాన్వీ సరదాగా బదులిచ్చిన తీరుతో ఆ ఆడిటోరియంలో ఉన్న అభిమానుల్లో జోష్ రెట్టింపయ్యింది. ఇక “పెద్ది’ కథా నేపథ్యాన్ని ఉద్దేశించి ఏ గేమ్ ఆడతారని ప్రశ్నించగా, జాన్వీ.. తాను గతంలో నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమాను గుర్తు చేసుకుంటూ క్రికెట్ నేర్చుకున్నానని తెలిపింది.
ఇక ఇదే వేదికపై జాన్వీకపూర్ మాట్లాడుతూ.. “శివరాజ్ కుమార్‌తో కలిసి చిన్న సన్నివేశంలోనే నటించా. తక్కువ సమయంలోనే ఆయన ఎంత శక్తిమంతమైన నటుడో అర్థమైంది. కళ్లతోనే నటించగలరు. మరోసారి ఆయనతో కలిసి నటించాలనుకుం టున్నా. రామ్‌చరణ్‌తో వర్క్ చేయడం మంచి అనుభూతి పంచింది.
‘పెద్ది’లో మా జోడీని చూసిన అభిమానులు బాగా ఆనందిస్తారని ఆశిస్తున్నా” అని తెలిపింది. ఇక రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం ఎంతో నిజాయితీగా, ప్రాణం పెట్టి పనిచేశాం. రాసిపెట్టుకోండి.. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలమ్స్ అవుతుంది. శివన్న లాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. జాన్వీ కూడా ఈ సినిమా కోసం ఎంతో నిజాయితీగా పనిచేశారు. నిర్మాత సతీశ్ హార్ట్ ఫుల్‌గా సినిమా నిర్మించారు.
బుచ్చిబాబు లేకపోతే ఈ సినిమా లేదు” అన్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “పెద్ది’ సినిమాతో రామ్‌చరణ్‌కు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నా. మా ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బలమైన భావోద్వేగం ఉంది. ‘పెద్ది’ పాత్ర ప్రతిఒక్కరి హృదయంలో నిలిచిపోతుంది” అని తెలిపారు. ‘పెద్ది లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాన’ని నిర్మాత వెంకట సతీశ్ కిలారు తెలిపారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






