సినీరంగ సమస్యల పరిష్కారానికి పవన్‌కల్యాణ్ హామీ
టాలీవుడ్‌లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి హామీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పర్సంటేజీ విధానంపై కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కొందరు నిర్మాతలు పవన్ కళ్యాణ్‌తో రాజమండ్రిలో సమావేశమయ్యారు. నిర్మాతలు వై రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సుధాకర్చరుకూరి, సాహు గారపాటి, వెంకట సతీశ్ కిలారు పవన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ముఖ్యంగా ఈ సమావేశంలో పర్సంటేజీ వివాదంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని తెలిపారు. ఆ థియేటర్ యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మల్టీప్లెక్స్ తరహాలోనే వచ్చిన లాభాల్లో నిర్మాతల నుంచి కొంత పర్సంటేజీ ఇస్తే, థియేటర్లు నిలదొక్కుకుంటాయన్న అభిప్రాయాన్ని పవన్ ముందు ఉంచారు.
ప్రభుత్వపరంగా చొరవ తీసుకుని ఒక నిర్దిష్టమైన పాలసీని రూపొందించాలని కోరారు. కొంతకాలంగా థియేటర్ల నిర్వహణ వ్యయం పెరిగిందని, నెల వారీ ఖర్చులూ అధికమయ్యాయని వివరించారు. విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఇవ్వడం ద్వారా థియేటర్ యజమానులపై భారం తగ్గుతుందని పవన్‌కు తెలిపారు. నిర్మాతలు చేసిన ప్రతిపాదనలను పరిశీలించాలని, ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ను ఆదేశించారు. నిర్మాతలు సమస్యలన్నీ విన్న పవన్.. నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటా నని భరోసా ఇచ్చారు. సినీరంగ సమస్యలు పరిష్కరించేలా దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అభయమిచ్చారు.
చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం
అగ్ర నటుడు చిరంజీవిని మంగళవారం పలువురు ఎగ్జిబిటర్లు కలిశారు. ‘చిరంజీవి కలిస్తే మా బాధలు, సమస్యలు చెప్పుకుంటామని ఎగ్జిబిటర్లు మాట్లాడిన విష యాన్ని వార్తల ద్వారా తెలుసు కున్న చిరంజీవి.. ఎగ్జిబిటర్లతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో చిరు మాట్లాడు తూ.. “పెద్ది’కి ఈ మీటింగ్ సంబంధం లేదు. ఆ సినిమా కోసం మిమ్మల్ని కలవలేదు. అందరూ నన్ను కలిసి సమస్యలు చెప్పుకుంటారు. కానీ, మిమ్మల్ని కలవడం ఇదే మొదటిసారి.
ఈ పర్సంటేజీ సిస్టమ్ గురించి ఎప్పుడో మొదలుపెట్టి, మధ్యలో ఎందుకు ఆపారు?. సమస్య పరిష్కారం అయ్యేలా నావంతు కృషి చేస్తా.” అని హామీ ఇచ్చారు. ఎగ్జిబిటర్లు తెలిపిన సమస్యలను సావధానంగా విన్న మెగాస్టార్ వాటన్నింటినీ ఓ నోట్‌బుక్‌లో రాసుకున్నారు. ఇదిలావుండగా, పర్సంటేజీ విషయమై బుధవారం ఉదయం నైజాం ఎగ్జిబిషన్ సెక్టార్ పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.






