పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
సీఎం సిరిసిల్ల పర్యటనలోపు స్పష్టమైన ప్రకటన చేయాలి
ఉద్యమకారుల హామీలపై కార్యాచరణ ప్రకటించాలి: గజ్జెల దేవరాజ్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): 2019–2024 మధ్య గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా చైర్మన్ గజ్జెల దేవరాజ్(JAC District Chairman Gajjela Devaraju) డిమాండ్ చేశారు. గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, భవనాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. బిల్లులు విడుదల కాకపోవడంతో మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన(Sircilla CM visit)కు వచ్చేలోపు పెండింగ్ బిల్లుల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని గజ్జెల దేవరాజ్ కోరారు.
అదే సమయంలో 2023 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన హామీల అమలుపై కూడా ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమానికి సంబంధించిన కేసుల ఉపసంహరణ, అమరవీరుల కుటుంబాలకు గౌరవ పింఛన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలపై కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఈ హామీల్లో 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణ, అమరవీరుల కుటుంబానికి ఉద్యోగం, పింఛన్ వంటి అంశాలు 2023లో కాంగ్రెస్ ప్రకటించిన హామీల్లో ఉన్నాయి.
పెండింగ్ బిల్లుల విడుదలకు నిర్దిష్ట తేదీని ప్రకటించడంతో పాటు ఉద్యమకారుల హామీల(Activists promises) అమలుపై కార్యాచరణను సీఎం సభా వేదికగా వెల్లడించాలని గజ్జెల దేవరాజ్ కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బుస వేణు, రాచర్ల వెంకన్న, అక్కెనపల్లి కరుణాకర్, పత్తిపాక పద్మశంకర్, పూసపల్లి సరస్వతి, గుగులోతు రేణ, కర్నే లక్ష్మి, మడుగుల వనజ, ఎస్.కె. సికిందర్, తిరునరహరి భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.