గుంతలమయం.. గుండి రహదారి చేపట్టాలని ధర్నా
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District) కేంద్రంలో రహదారి దుస్థితిపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని సాయి బాబా ఆలయం నుంచి లింకేజి రోడ్డు ద్వారా జాతీయ రహదారి మీదుగా గుండి వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు వాపోయారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పట్టణ ప్రజలు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రహదారి మరింత ప్రమాదకరంగా మారుతోందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు.తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గిరి గౌడ్, రాజేశ్వర్ ,సంతోష్ ,ప్రదీప్, అశోక్ ,రాజు ,శైలేష్ తదితరులున్నారు.




